పాన్ ఇండియా చిత్రాలంటే మొదటగా గుర్తుకు వచ్చేది టాలీవుడ్ పరిశ్రమే. 'బాహుబలి', 'ఆర్ ఆర్ ఆర్' వంటి చిత్రాలతో ఈ ట్రెండ్‌కు పునాది పడింది. ఆ తర్వాత 'కార్తికేయ-2', 'పుష్ప' వంటి సినిమాలు వచ్చాయి. కన్నడ పరిశ్రమ రెండో స్థానంలో నిలుస్తుంది. 'కేజీఎఫ్' సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో కన్నడ చిత్రాలకు గుర్తింపు లభించింది. ఆ తర్వాత కోలీవుడ్ పేరు వినిపిస్తుంది.
టాలీవుడ్ నెంబర్ వన్
పాన్ ఇండియా చిత్రాలు తీయడం సౌత్ వారికే సాధ్యమని, అందులోనూ టాలీవుడ్ మొదటి స్థానంలో ఉండటం నిజం. తెలుగు సినిమాల పాన్ ఇండియా విజయాన్ని చూసి అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి సీనియర్ స్టార్లు తెలుగు వారిని చూసి నేర్చుకోవాలని బాలీవుడ్ రచయితలకు క్లాస్ పీకారు. అయితే తాజాగా పాన్ ఇండియా చిత్రాలను ఉద్దేశించి బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాన్ ఇండియా ఒక భారీ స్కాం
పాన్ ఇండియా సినిమాలు తీయడం ఒక భారీ కుంభకోణంగా అనురాగ్ కశ్యప్ అభిప్రాయపడ్డారు. ది హిందూ పత్రిక నిర్వహించిన 'ది హడల్' కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "నా దృష్టిలో పాన్ ఇండియా అనేది పెద్ద స్కాం. ఒక పాన్ ఇండియా సినిమా మొదలు పెట్టి పూర్తి చేయడానికి నాలుగేళ్లు పడుతుంది. అందరూ ఆ సినిమాపైనే ఆధారపడతారు. దీంతో వారి జీవితం ఆ సినిమాతోనే ముడిపడి ఉంటుంది.
సినిమాపై పెట్టే డబ్బు అంతా నిర్మాణానికే చేరదు. ఒకవేళ చేరినా అది భారీ, అవాస్తవిక సెట్లకే ఎక్కువగా ఖర్చవుతుంది. ఇది అర్థం లేని ఖర్చు. ఇలాంటి సినిమాలు కేవలం 1 శాతం మాత్రమే విజయం సాధిస్తాయి. వాటి వల్ల నష్టం తప్ప లాభం కనిపించదు" అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన సౌత్ ఇండస్ట్రీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.