పూణే ఎయిర్‌పోర్ట్‌లో టీ రూ.10, కాఫీ రూ.20 కే! సామాన్యులకు ఊరట!

udan yatri cafe

విమానాశ్రయాల్లో ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. సామాన్యులు అక్కడ కనీసం ఒక కప్పు టీ లేదా కాఫీ తాగాలన్నా జేబులు గుల్ల చేసుకోవాల్సిందే. అయితే, ఈ పరిస్థితికి భిన్నంగా పూణే అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు అందుబాటు ధరల్లో ఆహారం అందించేందుకు ఒక కొత్త కేఫ్‌ను ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

విమానాశ్రయాల్లో అధిక ధరలు: సామాన్యులకు భారంగా

విమాన ప్రయాణం ఇప్పుడు మధ్యతరగతి వారికి కూడా తప్పనిసరి అవుతోంది. ఎయిర్‌లైన్స్ అందిస్తున్న ఆఫర్ల వల్ల విమాన టికెట్లు ఒక్కోసారి రైలు ఛార్జీల కంటే తక్కువగా ఉంటున్నాయి. కానీ, విమానాశ్రయాల్లో టీ, కాఫీ లేదా ఇతర చిరుతిళ్లు తినాలంటే మాత్రం చాలా ఖర్చు చేయాల్సి వస్తోంది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం వంటి చోట్ల కేఫ్‌లలో ధరలు చూస్తే విమానం ఎక్కకుండానే కళ్లు తిరుగుతాయి. విమాన ప్రయాణికులంటే సంపన్నులే అనే భావనతో విమానాశ్రయాల్లో ధరలు ఎక్కువగా ఉండటం సామాన్య ప్రయాణికులకు మింగుడు పడటం లేదు.

పూణే ఎయిర్‌పోర్ట్‌లో 'ఉడాన్‌ యాత్రి కేఫే'

ఈ నేపథ్యంలో పూణే అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం సరికొత్తగా ‘ఉడాన్‌ యాత్రి కేఫే’ అనే సేవను ప్రారంభించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. "ఎట్టకేలకు నిరీక్షణ ముగిసింది! పూణే విమానాశ్రయంలో టీ రూ.10, కాఫీ రూ.20 కే అందుబాటులోకి రానున్నాయి" అని ఆయన ట్వీట్ చేశారు.

'ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్' స్ఫూర్తితో ఏర్పాటు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్’ (UDAN - ఉడాన్) సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ కేఫ్‌ను ఏర్పాటు చేశారు. లక్షల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే పూణే విమానాశ్రయంలో తక్కువ ధరలకు అధిక నాణ్యత గల ఆహార పదార్థాలు అందుబాటులోకి రావడం ఒక మంచి మార్పు అని ప్రయాణికులు భావిస్తున్నారు. సమోసా వంటి ఇతర తినుబండారాలు కూడా రూ.20 ధరల్లో అందిస్తున్న ఈ కేఫ్‌లు కోల్‌కతా, చెన్నై, ముంబైలలో కూడా సేవలు అందిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా మార్పు రావాలని ఆకాంక్ష

విమానాశ్రయాలు సంపన్నులకు మాత్రమే అనే అభిప్రాయాన్ని మార్చేలా, ఎక్కువ మందికి ఉపయోగపడేలా ఇలాంటి మార్పులు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో రావాలని సామాన్య ప్రయాణికులు కోరుకుంటున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు