ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఆడుకునేందుకు వెళ్లిన నలుగురు చిన్నారులు ఆగి ఉన్న కారులో ప్రమాదవశాత్తు చిక్కుకొని ఊపిరాడక మృతి చెందారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఆడుకుంటూ కారు వద్దకు వెళ్లిన చిన్నారులు
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, నలుగురు చిన్నారులు ఆదివారం ఉదయం ఆడుకునేందుకు ఇంటి నుండి బయలుదేరారు. ఎంతసేపటికీ వారు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల వెతికినా పిల్లలు కనిపించలేదు.
ఆటోమేటిక్‌గా లాక్ అయిన కారు, ఊపిరాడక మృతి
చివరికి, స్థానిక మహిళా మండలి కార్యాలయం వద్ద ఆగి ఉన్న కారులో చూడగా, నలుగురు చిన్నారులు విగత జీవులుగా కనిపించారు. ఆడుకుంటుండగా కారు డోర్ ఆటోమేటిక్‌గా లాక్ పడిపోవడంతో లోపల చిక్కుకున్న చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.
ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది
కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. అయితే, వైద్యులు వారు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతులను ఉదయ్ (8), చారుమతి (8), చరిష్మా (6), మరియు మనస్విగా గుర్తించారు. వీరిలో చారుమతి, చరిష్మా అక్కాచెల్లెళ్లని స్థానికులు తెలిపారు.
ద్వారపూడిలో విషాద ఛాయలు
ఒకేసారి నలుగురు పిల్లలు మృతి చెందడంతో ద్వారపూడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల తల్లిదండ్రులు మరియు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.