మార్కెట్లో అనేక సంప్రదాయ కేశ తైలాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి జుట్టుకు అవసరమైన పోషణను అందించి, నిగారింపును ఇస్తాయి. అంతేకాకుండా, తలకు, మాడుకు చల్లదనాన్నిచ్చి, చుండ్రు వంటి సమస్యలను నివారిస్తాయి.
1. కొబ్బరి నూనె
కేశ సంరక్షణలో కొబ్బరి నూనె ప్రధానమైనది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకల మూలాలకు శక్తినిచ్చి, జుట్టు ఒత్తుగా, వేగంగా పెరగడానికి సహాయపడతాయి. కొబ్బరి నూనెను నిమ్మరసంతో కలిపి తలకు పట్టించి, ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది. కొబ్బరి నూనెలో మందార పువ్వులు వేసి వేడి చేసి తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు.
2. ఆవ నూనె
మందపాటి, నల్లటి జుట్టును పొందాలంటే ఆవ నూనె చాలా ఉపయోగపడుతుంది. ఈ తైలం తలలో రక్త ప్రసరణను పెంచి, జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.
3. బాదం నూనె
బాదం నూనెలో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది. కొబ్బరి, ఉసిరి నూనెల మాదిరిగానే దీనికి కూడా మంచి పోషక విలువలు ఉంటాయి. త్వరగా జుట్టు పెరగాలనుకునే వారు రోజూ తలకు బాదం నూనెను పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.
4. ఆముదం నూనె
ఆముదం నూనె కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. వారానికి రెండుసార్లు తలకు ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. ఇది జుట్టును నిగనిగలాడేలా చేస్తుంది.
5. మందార నూనె
మందార నూనె కేశాలను మూలాల నుండి బలోపేతం చేస్తుంది. ఎండలో తిరగడం వల్ల, దుమ్ము, ధూళి, వేడి వల్ల జుట్టు రంగు గోధుమ రంగులోకి మారకుండా ఈ నూనె నిరోధిస్తుంది.
6. బృంగరాజ్ తైలం
బృంగరాజ్ తైలంతో మాడుపై మసాజ్ చేయడం వల్ల తలలో ఇన్ఫెక్షన్లు రావు. ఇది చుండ్రును అరికడుతుంది. జుట్టు బూడిద రంగులోకి మారకుండా చేస్తుంది. వేసవిలో తలకు చల్లదనాన్ని కూడా ఇస్తుంది.
7. ఉల్లి నూనె
ఉల్లిపాయలో కేశ సంరక్షణకు పనికొచ్చే అనేక పోషకాలు ఉన్నాయి. ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలకు, పోషణకు తోడ్పడుతుంది. ఉల్లిపాయ రసం మరియు తేనెను కలిపి తలకు అప్లై చేయడం వలన వెంట్రుకలు ఊడిపోవడం తగ్గి, జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది.
8. ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్‌ను కొబ్బరి నూనెతో కలిపి వారానికి రెండుసార్లు జుట్టుకు అప్లై చేస్తే, మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. తరచుగా ఇలా చేయడం వల్ల కేశ సమస్యలు తొలగిపోయి, వెంట్రుకలు నిగనిగలాడుతాయి.