బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్' మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాని సీక్వెల్‌గా వచ్చిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా నవ్వులు పంచిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. పాత కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేసిన ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అయిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
సన్ ఆఫ్ సర్దార్ 2 - కథ:
జస్వీందర్ సింగ్ అలియాస్ జెస్సీ (అజయ్ దేవగణ్) తన భార్య డింపుల్ (నీరూ బాజ్వా)ని కలవడానికి స్కాట్లాండ్ వెళ్తాడు. అక్కడ డింపుల్ తనకి విడాకులు కావాలని చెప్పి షాక్ ఇస్తుంది. ఈ క్రమంలో జెస్సీకి పాకిస్థాన్ మహిళలైన రూబియా (మృణాల్ ఠాకూర్), సబా (రోషిణి), మెహరీష్ (ఖుబ్రా సైత్) మరియు ట్రాన్స్‌జెండర్ గుల్ (దీపిక డొబ్రియాల్)తో పరిచయం అవుతుంది. సబా ప్రేమించిన అబ్బాయి గూగీ (సాహిల్)తో పెళ్లి చేయడానికి జెస్సీ వారందరితో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలోనే ఆర్మీ కర్నల్ అని అబద్ధం చెప్పి గూగీ తండ్రి రాజా (రవి కిషన్) ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత జెస్సీ, రాజా మధ్య జరిగే సరదా సంఘటనలు, సబా-గూగీల పెళ్లి జరిగిందా లేదా అనేది సినిమా కథ.
సన్ ఆఫ్ సర్దార్ 2 - సినిమా విశ్లేషణ:
పాత చింతకాయ పచ్చడి లాంటి కథతో ఈ సినిమా తీశారు. ఇలాంటి కథలు చాలా వచ్చినా, ప్రజెంట్ చేసిన విధానంపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు విజయ్ కుమార్ అరోరా జస్ట్ పాస్ అయ్యారనే చెప్పాలి. కథ, కథనాల్లో కొత్తదనం లేకపోయినా, అక్కడక్కడా కొన్ని మంచి కామెడీ సన్నివేశాలు, పంచ్ డైలాగ్స్ నవ్విస్తాయి. ముఖ్యంగా, ద్వితీయార్థంలో రాజా ఇంటికి వెళ్ళాక జరిగే టామ్ అండ్ జెర్రీ ఆట, యుద్ధ ట్యాంకర్ సన్నివేశాలు బాగా పండాయి. అజయ్ తన ఆర్మీ కర్నల్ పాత్రను కాపాడటానికి పడే పాట్లు ప్రేక్షకులను నవ్విస్తాయి. అయితే ప్రథమార్థం మాత్రం పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం పట్టింది.
అజయ్ దేవగణ్ తనదైన శైలిలో జస్వీందర్ పాత్రలో ఒదిగిపోయారు. మృణాల్ ఠాకూర్ హాట్‌గా కనిపించడంతో పాటు తన పాత్రకు న్యాయం చేశారు. వీరిద్దరి మధ్య వచ్చే డ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ అయినప్పటికీ, తెరపై ఫన్నీగా అనిపిస్తుంది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. దర్శకుడు పాత కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేసినా, ప్రేక్షకులను పూర్తిగా అలరించడంలో తడబడ్డారు.
బలమైన అంశాలు:
- అజయ్, మృణాల్‌ల నటన
- కొన్ని ఫన్నీ సన్నివేశాలు, డైలాగ్స్
- ద్వితీయార్థంలో వచ్చే కామెడీ
- ఎమోషనల్ క్లైమాక్స్
బలహీనతలు:
- రొటీన్ కథ, కథనాలు
- స్లోగా సాగే ప్రథమార్థం
- అంచనాకు అందే ప్లాట్‌పాయింట్స్
- యాక్షన్‌కు ప్రాధాన్యత లేకపోవడం
చివరిగా:
‘సన్ ఆఫ్ సర్దార్ 2’ కేవలం నవ్వుల కోసమే వచ్చిన సినిమా. కథలో కొత్తదనం లేకపోయినా, కొన్ని నవ్వుల సన్నివేశాల కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. అయితే, అంచనాలు లేకుండా వెళితేనే ఈ సినిమా మీకు నచ్చుతుంది. అజయ్-మృణాల్ జోడి కామెడీ మాత్రం అలరిస్తుంది.