వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన, జగన్‌కు రైతులపై అకస్మాత్తుగా ప్రత్యేకమైన ప్రేమ పుట్టుకొచ్చిందని తీవ్రంగా ఎద్దేవా చేశారు.
రైతులపై ఆకస్మిక ప్రేమ.. ఉనికి కోసమే!
జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్క రైతును కూడా పరామర్శించలేదని మంత్రి ఆనం విమర్శించారు. ఇప్పుడు తన ఉనికి కోల్పోతానన్న భయంతోనే వైఎస్ జగన్ రైతుల పేరుతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత అర్హత కూడా జగన్ సంపాదించుకోలేకపోయారని ఆయన విమర్శించారు.
అసెంబ్లీలో చర్చకు రండి
'మొంథా' తుఫానును ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమించారని, ప్రభుత్వం చక్కగా పని చేసిందని ప్రజలంతా ప్రశంసిస్తున్నారని ఆనం తెలిపారు. ప్రభుత్వం పనిచేయకపోతే అసెంబ్లీలోకి వచ్చి చర్చించాలని, అంతేగానీ బయట విమర్శలు చేయడం కాదని హితవు పలికారు. జగన్ ప్రభుత్వంలో చేసిన పనులు, కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులపై అసెంబ్లీలో చర్చిస్తే ప్రజలకు స్పష్టత వస్తుందన్నారు.
జిల్లాల ఏర్పాటుపై త్వరలో నిర్ణయం
వైఎస్ జగన్ పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలను ప్రజలు కూడా మర్చిపోయారని మంత్రి ఆనం వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో, కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు విషయంలో మంత్రి వర్గ ఉపసంఘం పని చేస్తోందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు.
కాగా, ఇటీవలే మొంథా తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. ఈ విమర్శలకు కౌంటర్‌గా మంత్రి ఆనం తాజా వ్యాఖ్యలు చేయడం.. ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించింది.
