రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై కఠినంగా వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు, త్వరలోనే తాను భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని పెద్ద సంకేతమే ఇచ్చారు.
మోదీ నా గొప్ప స్నేహితుడు: ట్రంప్
ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, ప్రధాని మోదీతో తనకున్న సంబంధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. "మోదీ నాకు గొప్ప స్నేహితుడు. ఆయనొక గొప్ప వ్యక్తి" అని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీతో వాణిజ్య అంశాలపై చర్చలు చాలా సానుకూలంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు.
భారత్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్?
"ప్రధాని మోదీ నన్ను భారత్ రావాలని కోరుకుంటున్నారు. మేం ఆ ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. నేను తప్పకుండా వెళ్తాను" అని ట్రంప్ వెల్లడించారు.
రష్యా ఆయిల్‌పై కీలక వ్యాఖ్యలు
రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంపై కూడా ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మోదీ రష్యా నుంచి చమురు కొనడం చాలావరకు మానేశారు" అని ఆయన చెప్పడం గమనార్హం.
గతంలో ఇదే కారణంతో భారత్‌పై భారీ సుంకాలు విధించిన ట్రంప్, ఇప్పుడు స్వరం మార్చడం ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు ఫలవంతం అవుతున్నాయనడానికి సంకేతంగా భావిస్తున్నారు.
వచ్చే ఏడాదే పర్యటన?
వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించాలని ప్లాన్ చేస్తున్నారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా, "అవును. అలాగే కావచ్చు" అని ట్రంప్ బదులిచ్చారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కీలక దశలో ఉన్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన పర్యటన ఖరారైతే, ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది.

