కర్ణాటక సీఎం కుర్చీలో మార్పు ఖాయమా? ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రికి సొంత అధిష్టానమే షాక్ ఇచ్చిందని సమాచారం!
ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాల నేపథ్యంలో, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. కొంతకాలంగా కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే ప్రచారం బలంగా జరుగుతోంది.
ఢిల్లీకి సిద్ధరామయ్య.. అపాయింట్‌మెంట్ నిరాకరణ?
ఈ క్రమంలో సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కె. శివకుమార్ తరచూ బెంగళూరు, ఢిల్లీల మధ్య పర్యటిస్తున్నారు. నవంబర్ చివరి నాటికి రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ నేపథ్యంలోనే, సిద్ధరామయ్య మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అదే పర్యటనలో కాంగ్రెస్ పెద్దలతో సమావేశమయ్యేందుకు ఆయన సమయం కోరగా, "ఆ సమావేశం ఇప్పుడు అవసరం లేదు" అని కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు స్పష్టం చేసిందని సమాచారం.
"మరో రెండున్నరేళ్లు మేమే ఉంటాం"
కేంద్ర నాయకత్వం సమయం ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ, సిద్ధరామయ్య మాత్రం తన ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. మరో రెండున్నరేళ్లు తమ పార్టీయే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌కే ప్రజలు ఓటు వేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అధిష్టానం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం, అదే సమయంలో సిద్ధరామయ్య ధీమాగా మాట్లాడటం.. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠను మరింత పెంచుతోంది.

