అభివృద్ధిపై బహిరంగ చర్చకు రండి: సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్

surya
By -
0

సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్


తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సంచలన సవాల్ విసిరారు. గత పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధి, గడిచిన రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన పనులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు. "చెత్త ఎవరిది? సత్తా ఎవరిది?" అనే నినాదంతో, ఇరు ప్రభుత్వాల పనితీరును ప్రజల ముందు తేల్చుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు.


బుధవారం తెలంగాణ భవన్‌లో "జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక"ను విడుదల చేసిన అనంతరం కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్‌లో ఓడిపోతామనే భయం, ఫ్రస్ట్రేషన్‌తోనే రేవంత్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తమకు కూడా రేవంత్ రెడ్డి భాషలోనే సమాధానం చెప్పే సత్తా ఉందని, కానీ తాము సంయమనంతో, గౌరవంగానే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు.


చర్చకు ఎక్కడైనా సిద్ధం

బహిరంగ చర్చకు సంబంధించి తేదీ, సమయం, వేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే నిర్ణయించుకోవచ్చని కేటీఆర్ స్పష్టం చేశారు. "చర్చకు కమాండ్ కంట్రోల్ సెంటర్ అయినా, గాంధీ భవన్ అయినా, చివరికి శాసనసభ అయినా... ఎక్కడైనా మేం సిద్ధంగా ఉన్నాం. 2014 నుంచి 2023 వరకు మా పదేండ్ల పాలనలో మేము ఏం చేశామో చూపిస్తాం. ఈ రెండేండ్లలో మీరు చేసిన పనులేమిటో చెప్పండి. దమ్ముంటే చర్చకు రావాలి," అని కేటీఆర్ సవాల్ విసిరారు.


హైదరాబాద్ అభివృద్ధిపై ఘాటు విమర్శలు

హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క హైదరాబాద్‌లోనే 42 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించి, నగర రూపురేఖలు మార్చామని గుర్తుచేశారు. "మేము మొదలుపెట్టిన పనులకే కాంగ్రెస్ నేతలు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు తప్ప, ఈ రెండేండ్లలో వాళ్లు కొత్తగా ఒక్క రోడ్డు అయినా నిర్మించారా? కనీసం రోడ్లపై పడిన గుంతలైనా పూడ్చారా?" అని ఆయన నిలదీశారు. సీఎం అంటే "చీఫ్ మినిస్టర్" అని, "కటింగ్ మినిస్టర్" కాదని, రేవంత్ రెడ్డి కొంత హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు.


సంక్షేమం, పర్యావరణంపై ప్రశ్నల వర్షం

కేవలం మౌలిక వసతులే కాకుండా, సంక్షేమం, పర్యావరణం వంటి పలు అంశాలపై కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి పేదలకు అందించిందని, కాంగ్రెస్ ఈ రెండేండ్లలో ఒక్క ఇల్లయినా కట్టిందా? అని ప్రశ్నించారు. కట్టకపోగా, "హైడ్రా" పేరుతో వేలాది మంది పేదల ఇండ్లను కూలగొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


హైదరాబాద్ మెట్రోను పూర్తి చేసింది కూడా తమ ప్రభుత్వమేనని పునరుద్ఘాటించిన కేటీఆర్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో, ఎల్&టీ సీఎఫ్‌ఓలను బెదిరిస్తోందని ఆరోపించారు. ఈ బెదిరింపులకు తాళలేక ఎంతమంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారో లెక్క తేల్చడానికి చర్చకు సిద్ధమా? అని నిలదీశారు.


"స్వచ్ఛ్ హైదరాబాద్" కార్యక్రమంతో వేలాది ఆటోలను ప్రవేశపెట్టి, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచామని, తమ హయాంలో స్వచ్ఛ్ సర్వేక్షణ్‌లో 34 అవార్డులు సాధించామని కేటీఆర్ గుర్తుచేశారు. పదేండ్లలో హైదరాబాద్‌ను "క్లీన్ సిటీ"గా మారిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని "మురికికూపం"గా మార్చిందని విమర్శించారు. అంతేకాకుండా, రూ. 10 వేల కోట్ల కోసం కక్కుర్తిపడి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్లను నరికివేసి జీవవైవిధ్యాన్ని దెబ్బతీశారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అన్ని అంశాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్ నేతలు సిద్ధమా? అని కేటీఆర్ పునరుద్ఘాటించారు.



Tags:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!