"లోకేష్‌ను నేను పెంచా.. దేవాన్ష్‌ను ఇప్పుడు బ్రాహ్మణి చూసుకుంటోంది!" కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లల పెంపకంపై తల్లులకు ఆమె ఇచ్చిన సలహాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
కుప్పం సామగుట్లపల్లి పాఠశాలలో జరిగిన ‘విలువల బడి’ కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి, పిల్లల పెంపకంలో తల్లులదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల లోకేష్ పెంపకం బాధ్యత తానే తీసుకున్నానని గుర్తుచేశారు. ఇప్పుడు లోకేష్ ప్రజాసేవలో బిజీగా ఉండటంతో, మనవడు దేవాన్ష్ చదువు, క్రీడల బాధ్యతలను కోడలు బ్రాహ్మణి దగ్గరుండి చూసుకుంటోందని కుటుంబ విషయాలను పంచుకున్నారు.
తల్లిదండ్రులకు భువనేశ్వరి సూచనలు:
ప్రస్తుతం టెక్నాలజీని చెడు కోసం వినియోగించే ప్రమాదం పెరుగుతోందని, అందుకే తల్లులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆమె హితవు పలికారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఈ విషయాలను తప్పక పాటించాలని ఆమె కోరారు:
చిన్నతనంలోనే పిల్లలకు చదువుతో పాటు సంస్కారం, నైతిక విలువలు నేర్పించాలి.
పిల్లలకు ఏ రంగంలో ఆసక్తి ఉందో గుర్తించి, వారిని ఆ దిశగానే ప్రోత్సహించాలి.
కేవలం మార్కులు మాత్రమే కాదు, మంచి ప్రవర్తన కూడా ముఖ్యమని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు నిండిపోయి 'క్లోజ్డ్' బోర్డులు కనిపించడం ఎంతో సంతోషకరమైన విషయమని భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. స్కూళ్లలో ‘మోరల్ సైన్స్’ సబ్జెక్ట్‌ను తిరిగి తీసుకువచ్చినందుకు మంత్రి లోకేష్‌ను ఆమె అభినందించారు. విద్యతో పాటు విలువలనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న 'విలువల బడి' వ్యవస్థాపకుడు లెనిల్‌ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

