అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా భారత్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు రష్యా ఇచ్చిన ఆ బంపర్ ఆఫర్ చూస్తే అగ్రరాజ్యానికి మండుతుందేమో!
భారత్, రష్యా మధ్య బంధాన్ని విడదీయడానికి పాశ్చాత్య దేశాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయాలని ఒత్తిడి తెస్తున్నా, భారత్ మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాలతో భయపెట్టినా, భారత్ 'తగ్గేదేలే' అనే రీతిలో సమాధానమిస్తోంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ, భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. పాశ్చాత్య దేశాల అడ్డంకులు ఎన్ని ఉన్నా, భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యానే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఆంక్షలు ఉన్నా.. ఆఫర్లు ఇస్తాం!
రష్యన్ వార్తా సంస్థ TASSకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలిపోవ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆంక్షలను పక్కనపెట్టి, భారత్‌తో వాణిజ్యాన్ని ఎలా పెంచుకోవాలనుకుంటున్నారో వివరించారు:
మెరుగైన ఒప్పందాలు: భారత్‌కు ఇంధన వనరుల కొనుగోలు విషయంలో మరింత మెరుగైన ఆఫర్‌లు (Better Deals) ఇచ్చేందుకు రష్యా సిద్ధంగా ఉంది.
ఆంక్షల ప్రభావం: రోస్‌నెఫ్ట్, లుకోయిల్ వంటి రష్యన్ ఆయిల్ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించినా, చమురు సరఫరాకు రష్యా తొలి ప్రాధాన్యత ఇస్తుంది.
భారత్ మద్దతు: ఐక్యరాజ్యసమితిని కాదని, ఏకపక్షంగా విధించే చట్టవిరుద్ధమైన ఆంక్షలను భారత్ గుర్తించదని రష్యా బలంగా నమ్ముతోంది.
పాశ్చాత్య దేశాలకు నష్టం: ఇలాంటి ఆంక్షలు పాశ్చాత్య దేశాల వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలపైనే ప్రపంచ విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు.
రష్యా-భారత సంబంధాలను దెబ్బతీసేందుకు వెస్ట్రన్ కంట్రీస్ చేస్తున్న ప్రయత్నాలను న్యూఢిల్లీ సమర్థవంతంగా తిప్పికొట్టిందని అలిపోవ్ ప్రశంసించారు.

