ఇండిగో విమానాల రద్దు వ్యవహారం ఇప్పుడు సీఈవో మెడకు చుట్టుకుంది! డీజీసీఏ కొరడా ఝుళిపించగా.. మరోవైపు ప్రయాణికుల జేబులకు చిల్లు పడకుండా కేంద్రం టికెట్ ధరలకు కళ్లెం వేసింది.
దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దవుతుండటంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఈ పరిస్థితిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అత్యంత తీవ్రంగా స్పందించింది. దీనికి యాజమాన్యానిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేస్తూ, ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌కు (Pieter Elbers) షోకాజ్ నోటీసు జారీ చేసింది. "సంస్థను నడపడంలో, వనరుల ప్లానింగ్‌లో మీరు ఘోరంగా విఫలమయ్యారు. 24 గంటల్లోగా మాకు వివరణ ఇవ్వాలి" అని డెడ్‌లైన్ విధించింది.
పైలట్ల ఆరోగ్యం పట్టించుకోలేదు..
ఇండిగో వైఫల్యాలను డీజీసీఏ ఎత్తిచూపింది. పైలట్ల అలసటను (Fatigue Management) గుర్తించడంలో, వారికి తగిన విశ్రాంతి ఇవ్వడంలో యాజమాన్యం విఫలమైందని మండిపడింది. ప్రయాణికులకు నమ్మకమైన సేవలు అందించలేకపోయారని సీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
రంగంలోకి కేంద్ర మంత్రి.. కమిటీ ఏర్పాటు
ఈ సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సీరియస్‌గా స్పందించారు. సమస్య మూలాలను కనుగొనేందుకు నలుగురు సభ్యులతో ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. రిపోర్ట్ వచ్చిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు, డిసెంబర్ 10 నుంచి 15 మధ్య పరిస్థితి చక్కబడుతుందని ఇండిగో సీఈవో ఒక వీడియోలో తెలిపారు.
రూ. 18 వేలు దాటకూడదు!
ఇండిగో రద్దుల సాకుతో మిగిలిన సంస్థలు టికెట్ రేట్లు పెంచేస్తుండటంతో కేంద్రం తక్షణమే చర్యలు చేపట్టింది. విమాన టికెట్ ధరలపై గరిష్ఠ పరిమితి (Price Cap) విధించింది.
కొత్త ధరల నిబంధనలు ఇవే:
ప్రయాణించే దూరాన్ని బట్టి టికెట్ ధర నిర్ణయించాలి.
గరిష్ఠంగా టికెట్ ధర రూ. 7,500 నుంచి రూ. 18,000 మధ్య మాత్రమే ఉండాలి.
అంతకు మించి వసూలు చేయడానికి వీల్లేదు.

