అమరావతి అంటే ఇకపై కేవలం పరిపాలనా కేంద్రం మాత్రమే కాదు.. భవిష్యత్ టెక్నాలజీకి అడ్డా! హాలీవుడ్ సినిమాల్లో చూసే 'క్వాంటమ్' టెక్నాలజీ ఇప్పుడు మన రాజధానిలో రియాలిటీ కాబోతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మహర్దశ పట్టింది. అత్యాధునిక పరిశోధనలకు కేంద్ర బిందువుగా మారుతున్న మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు క్యూ కడుతున్నాయి. తాజాగా 'గ్లోబల్ క్వాంటమ్ బయో ఫౌండ్రీ' (Global Quantum Bio Foundry) అనే సంస్థ అమరావతిలో భారీ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. సుమారు రూ. 200 కోట్ల పెట్టుబడితో కొత్త ఔషధాలు, మెటీరియల్ సైన్స్‌పై ప్రయోగాలు చేసేందుకు సిద్ధమైంది.
దేశంలోనే తొలిసారి.. అమరావతిలో!
గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఆ సంస్థ ప్రతినిధులు, అంతర్జాతీయ పరిశోధకులు భేటీ అయ్యారు.
ఎకో సిస్టం: అమరావతిలో ఏర్పాటు కాబోయే ఈ కేంద్రం దేశంలోనే మొట్టమొదటి 'క్వాంటమ్ బయోమెడికల్ రీసెర్చ్ ఎకో సిస్టం'గా రికార్డు సృష్టించనుంది.
పరిశోధనలు: మాలిక్యులర్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ వంటి అత్యంత క్లిష్టమైన, అధునాతన రంగాల్లో ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి. ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసిన 'క్వాంటమ్ వ్యాలీ' తమను ఆకర్షించిందని వారు తెలిపారు.
ఐబీఎం, టీసీఎస్ కూడా వచ్చేస్తున్నాయి..
ఈ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఐటీ, జీనోమ్ వ్యాలీలు ఎలా సక్సెస్ అయ్యాయో.. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కూడా అదే రేంజ్లో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే ఐబీఎం (IBM), టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో 'క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం' (AQCC) కూడా అమరావతిలో మొదలుకానుందని గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయం, వైద్యం, రక్షణ రంగాలకు ఈ టెక్నాలజీని వాడతామని సీఎం స్పష్టం చేశారు.

