స్టాక్ మార్కెట్లో డబ్బులు పోతాయని భయపడేవారే ఎక్కువ. కానీ గత ఐదేళ్లలో మార్కెట్ సృష్టించిన సంపద తెలిస్తే షాక్ అవుతారు. ఏకంగా రూ. 148 లక్షల కోట్లు! ఇది గత 30 ఏళ్లలోనే సరికొత్త రికార్డు.
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది సువర్ణయుగం. 2020 నుంచి 2025 మధ్య ఉన్న ఈ ఐదేళ్ల కాలంలోనే దేశంలోని టాప్ 100 కంపెనీలు ఏకంగా రూ. 148 లక్షల కోట్ల సంపదను పోగుచేశాయి. కరోనా దెబ్బకు కుదేలవుతుందనుకున్న మార్కెట్, రాకెట్ వేగంతో దూసుకెళ్లడమే దీనికి కారణమని మోతీలాల్ ఓస్వాల్ (MOFSL) నివేదిక వెల్లడించింది.
డబ్బు ఎక్కడ పుట్టిందంటే?
ఈ సంపద సృష్టిలో 'ఫైనాన్షియల్స్' (బ్యాంకులు, ఆర్థిక సంస్థలు) రంగానిదే అగ్రస్థానం. ఆ తర్వాత ఇండస్ట్రియల్స్, టెక్నాలజీ రంగాలు ఉన్నాయి.
PSUల హవా: ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు (PSU) ఇరగదీశాయి. రక్షణ, ఇంధన రంగాల షేర్లు దుమ్మురేపాయి.
టాప్ స్పీడ్: అత్యంత వేగంగా, నిలకడగా సంపదను సృష్టించిన సంస్థలుగా బీఎస్ఈ (BSE), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (HAL) నిలిచాయి.
రూ. 16 ట్రిలియన్ల దిశగా భారత్..
ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించింది. రామ్‌దేవ్ అగర్వాల్ (మోతీలాల్ ఓస్వాల్ ఛైర్మన్) చెప్పినట్లు.. భారత్ ఇప్పుడు 'పవర్ ఆఫ్ కాంపౌండింగ్' దశలో ఉంది.
గత 17 ఏళ్లలో మన ఎకానమీ 1 ట్రిలియన్ డాలర్ల నుంచి 4 ట్రిలియన్లకు చేరింది.
రాబోయే 17 ఏళ్లలో ఇది 16 ట్రిలియన్ డాలర్లకు (నాలుగు రెట్లు) పెరిగే ఛాన్స్ ఉంది.
మంచి కంపెనీలను ఎంచుకుని, ఓపికగా వెయిట్ చేస్తే కోట్లు సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మొత్తానికి భారత ఆర్థిక వ్యవస్థ 'మల్టీ-ట్రిలియన్ డాలర్' రేసులో దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఫైనాన్స్, కన్స్యూమర్ రంగాల్లో పెట్టుబడి పెట్టేవారికి భవిష్యత్తులో కాసుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.

