ఈ రోజుల్లో జేబులో పది రూపాయలు ఉంటే ఒక కప్పు టీ కూడా రావడం కష్టం. అలాంటిది అదే రూ. 10కి కడుపునిండా టిఫిన్ పెడితే ఎలా ఉంటుంది? గువాహటికి చెందిన ఓ మహిళ లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఈ పని ఇప్పుడు అందరి మన్ననలు పొందుతోంది.
గువాహటి క్లబ్ ఫ్లైఓవర్ సమీపంలోని తెలుగు కాలనీలో సన్నో కౌర్ (47) అనే మహిళ ఒక చిన్న హోటల్‌ను నడుపుతున్నారు. సామాన్యులు, విద్యార్థుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఆమె ఈ హోటల్ ప్రారంభించారు.
మెనూ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఇక్కడ దొరికే టిఫిన్ల ధరలు సామాన్యులకు ఒక వరం లాంటివి.
రూ. 10 మాత్రమే: వేడి వేడి ప్లెయిన్ దోశ, ఇడ్లీ కేవలం పది రూపాయలకే లభిస్తాయి. వీటికి కొబ్బరి చట్నీ, సాంబార్ కాంబినేషన్ అదిరిపోతుంది.
ఇతర ధరలు: మసాలా దోశ, ఆలూ పరాఠా కేవలం రూ. 20, ఎగ్ దోశ రూ. 30, చీజ్ దోశ రూ. 40.
యూట్యూబ్ చూసి నేర్చుకుని..
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సన్నో కౌర్‌కు మొదట్లో ఈ వంటలు చేయడం రాదు. కుటుంబ సభ్యుల కోసం కేవలం యూట్యూబ్ (YouTube) చూసి వంట నేర్చుకున్నారు. ఇంటి సభ్యుల ప్రోత్సాహంతో గతేడాది ఈ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఆమె కుటుంబంలోని 14 మంది సభ్యులు దీని నిర్వహణలో సాయం చేస్తుంటారు.
లాభం పక్కన పెట్టి.. నిత్యావసరాలు, గ్యాస్ ధరలు పెరిగిపోయిన ఈ రోజుల్లో తక్కువ ధరకు ఇవ్వడం కష్టమే అయినా.. విద్యార్థుల ఆనందం కోసం ఆమె వెనకడుగు వేయడం లేదు. రోజుకు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు ఆదాయం వస్తోందని, భవిష్యత్తులో ధరలు పెంచినా అందరికీ అందుబాటులోనే ఉంచుతానని ఆమె భరోసా ఇస్తున్నారు.

