రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు యుద్ధం ప్రకటించారు. ప్రాజెక్టులు ఆపితే సహించేది లేదని, అవసరమైతే పాదయాత్రకు రెడీ అంటూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు!
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మల్లన్న జాతర ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన, రేవంత్ రెడ్డి సర్కార్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. రైతు భరోసా, రుణమాఫీ, పంటల కొనుగోలు.. ఇలా అన్నింటా ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.
మూడు పంటల హామీ.. ఒక్కటికే పరిమితమా?
గత ఎన్నికల ముందు మూడు పంటలకు రైతుబంధు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు దానిని కుట్రపూరితంగా ఒక్క పంటకే కుదించే ప్రయత్నం చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు.
రైతుల పట్ల ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఆయన ఇలా ఏకరువు పెట్టారు:
దాదాపు 70 లక్షల ఎకరాల్లో వేసిన దీర్ఘకాలిక పంటలకు నగదు ఎగ్గొట్టే ప్లాన్ చేస్తున్నారు.
సోయా, మక్క పంటలను కొని 48 గంటల్లో డబ్బులు వేస్తామన్నారు, కానీ 48 రోజులు గడిచినా దిక్కులేదు.
గత యాసంగికి సంబంధించిన రూ. 1,150 కోట్ల సన్న వడ్ల బోనస్‌ను ఇప్పటికీ పెండింగ్‌లో పెట్టారు.
పాదయాత్ర చేస్తా.. సర్కార్‌కు అల్టిమేటం!
సంగారెడ్డి జిల్లాపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల పనులను ఈ ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు.
ఈ ప్రాజెక్టుల పనులను వెంటనే ప్రారంభించకపోతే, త్వరలోనే తాను స్వయంగా పాదయాత్ర చేపడతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నారాయణఖేడ్‌లో 8 కొత్త చెరువులకు భూసేకరణ పూర్తయినా పనులు ఎందుకు మొదలుపెట్టలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు.

