Ind vs SA: 358 కొట్టినా ఓటమి.. రాహుల్ చెప్పిన కారణం ఇదే!

naveen
By -

358 పరుగులు కొట్టినా ఓడిపోతామని టీమిండియా కలలో కూడా ఊహించి ఉండదు! మ్యాచ్ తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పిన ఆ ఒక్క కారణం వింటే.. నిజమే కదా అనిపిస్తుంది.


KL Rahul blames dew factor for loss against South Africa.


రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో పరుగుల వరద పారినా, చివరకు టీమిండియాకు నిరాశే మిగిలింది. 358 పరుగుల భారీ స్కోరును కూడా కాపాడుకోలేకపోవడానికి గల అసలు కారణాన్ని కెప్టెన్ కేఎల్ రాహుల్ బయటపెట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో మైదానంలో కురిసిన విపరీతమైన మంచు (Dew) తమ కొంప ముంచిందని వాపోయాడు. బంతి ఎంతలా తడిసిపోయిందంటే.. గ్రిప్ దొరక్క బౌలర్లు నానా తిప్పలు పడ్డారని, అంపైర్లు బంతిని మార్చాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అన్నాడు. "టాస్ ఓడిపోవడమే మా ఓటమికి ప్రధాన కారణం, అందుకు నన్ను నేనే నిందించుకుంటున్నా" అని రాహుల్ నవ్వుతూ వ్యాఖ్యానించాడు.


సెంచరీల మోత.. కానీ ఫలితం లేదు!

ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఇరు జట్ల ఇన్నింగ్స్‌లో హైలైట్స్ ఇవే:

  • భారత ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీలు అద్భుత శతకాలతో కదం తొక్కగా, చివర్లో రాహుల్ (66 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

  • సఫారీ ఛేజింగ్: దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్ (110) సెంచరీతో బదులివ్వగా, మాథ్యూ బ్రీట్జ్‌కే (68), డెవాల్డ్ బ్రెవిస్ (54) అతనికి చక్కటి సహకారం అందించారు.

  • ఫలితం: మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే సఫారీలు 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్నారు.


ఆ 20 పరుగులు చేసి ఉంటే..

350 పైచిలుకు పరుగులు చేసినా, బౌలర్లకు వెసులుబాటు కల్పించేందుకు మరో 20-25 పరుగులు అదనంగా చేసి ఉంటే బాగుండేదని డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించుకున్నట్లు రాహుల్ తెలిపాడు. రుతురాజ్, కోహ్లీల భాగస్వామ్యాన్ని, ముఖ్యంగా యాభై తర్వాత రుతురాజ్ పెంచిన వేగాన్ని ఆయన ప్రశంసించాడు. ఇక తాను ఆరో స్థానంలో కాకుండా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై స్పందిస్తూ.. క్రీజులో నెలకొన్న జోరును, రన్ రేట్‌ను అలాగే కొనసాగించేందుకే ఆ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాడు.


Tags: