మాదాపూర్‌లో ఫేక్ కాల్ సెంటర్: ఆస్ట్రేలియన్లే టార్గెట్.. రూ. 10 కోట్లు స్వాహా!

naveen
By -

హైదరాబాద్‌లో కూర్చుని ఆస్ట్రేలియన్ యాసలో మాట్లాడి.. ఏకంగా రూ. 10 కోట్లు కొల్లగొట్టారు! మాదాపూర్‌లోని ఆ బిల్డింగ్‌లో ఏం జరుగుతుందో తెలిస్తే పోలీసులే షాక్ అయ్యారు.


Cyberabad police officials displaying seized computers and mobile phones from a fake call center raid.


సైబరాబాద్ పోలీసులు మరో భారీ నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు చేశారు. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ‘రిడ్జ్ ఐటీ సొల్యూషన్స్’ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఈ ఫేక్ కాల్ సెంటర్‌పై శనివారం మెరుపు దాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో తొమ్మిది మందిని అరెస్టు చేయగా, ఈ ముఠా గత రెండేళ్లలో ఆస్ట్రేలియన్ పౌరుల నుంచి సుమారు రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు కొల్లగొట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు.


ఖమ్మం టూ ఆస్ట్రేలియా.. స్కెచ్ అదిరింది!

ఖమ్మం జిల్లాకు చెందిన ప్రవీణ్, ప్రకాశ్ అనే ఇద్దరు ప్రధాన సూత్రధారులు ఈ మోసానికి తెరలేపారు. వీరు ఆస్ట్రేలియన్ల కంప్యూటర్లు హ్యాక్ అయినట్లు నకిలీ పాప్-అప్‌లు, మెయిల్స్ పంపి భయపెట్టేవారు. కస్టమర్ కేర్ పేరుతో కాల్ రాగానే, హైదరాబాద్‌లో ఉన్న టెలీకాలర్లు పక్కా ఆస్ట్రేలియన్ యాసలో మాట్లాడి బాధితులను బురిడీ కొట్టించేవారు.


ఈ సైబర్ కేటుగాళ్ల మోసపూరిత విధానం ఇలా ఉంటుంది:

  • బాధితులను నమ్మించి వారి కంప్యూటర్‌లో 'ఎనీడెస్క్' (AnyDesk) వంటి రిమోట్ యాప్స్ ఇన్‌స్టాల్ చేయిస్తారు.

  • ఆ తర్వాత వారి ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఖాతాల్లోకి రహస్యంగా చొరబడి డబ్బులు కాజేస్తారు.

  • ఆ డబ్బును ఆస్ట్రేలియాలోని కొందరు భారతీయ విద్యార్థుల ఖాతాలకు బదిలీ చేస్తారు.

  • చివరగా హవాలా, క్రిప్టోకరెన్సీ మార్గాల ద్వారా ఆ సొమ్మును ఇండియాకు రప్పించుకుంటారు.


విద్యార్థులకు హెచ్చరిక

ఈ దాడిలో 12 కంప్యూటర్లు, 21 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు ప్రవీణ్, ప్రకాశ్ పరారీలో ఉండగా, మేనేజర్లు, టెలీకాలర్లు కటకటాలపాలయ్యారు. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు, ఎన్నారైలు తమ బ్యాంకు ఖాతాలను కమీషన్ కోసం ఎవరికీ అద్దెకు ఇవ్వొద్దని, అలా చేస్తే మనీలాండరింగ్ కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉందని పోలీసులు గట్టిగా హెచ్చరించారు.


Tags: