"నువ్వు లేని లోకం నాకొద్దు" అంటూ ఆ యువతి తీసుకున్న నిర్ణయం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ప్రేమించిన వాడు చనిపోయాడన్న వార్త తట్టుకోలేక 18 ఏళ్ల వయసులోనే నూరేళ్ల జీవితాన్ని ముగించేసింది!
టీనేజ్ ప్రేమలు ఈ మధ్య కాలంలో విషాదాంతం అవుతున్నాయి. ఒకరిని విడిచి మరొకరు ఉండలేక, క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు తల్లిదండ్రుల కడుపు కోతకు మిగుల్చుతున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి గ్రామంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అనారోగ్యంతో ప్రియుడు చనిపోయాడన్న వార్త తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
తండ్రి ద్వారా పరిచయం.. ప్రేమగా మారి!
కుకునూరుపల్లికి చెందిన ఆశని శంకర్ కూతురు శ్రావణి (18). ఇంటర్ పూర్తి చేసిన ఆమె ఇంటి వద్దే ఉంటోంది. శంకర్ తన కుటుంబ సమస్యల పరిష్కారం కోసం తరచూ దౌల్తాబాద్ మండలం మల్లేశంపల్లికి చెందిన కుమ్మరి మహేష్ (రహీమ్ బాబా) వద్దకు వెళ్లేవారు. ఈ క్రమంలోనే శ్రావణికి మహేష్‌తో పరిచయం ఏర్పడి, అది గాఢమైన ప్రేమగా మారింది. అతన్నే పెళ్లి చేసుకోవాలని ఆమె కలలు కంది.
4 రోజుల క్రితం ప్రియుడు.. ఇప్పుడు ప్రియురాలు!
అయితే విధి వారి ప్రేమను చూసి ఓర్వలేకపోయింది. నాలుగు రోజుల క్రితం మహేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి శ్రావణి తీవ్ర మనోవేదనకు గురైంది.
అన్నం మానేసి దిగులుగా ఉండటంతో కుటుంబ సభ్యులు నిలదీశారు.
తాను మహేష్‌ను ప్రేమించానని, అతనే కావాలనుకున్నానని చెప్పింది.
అతను లేడని తెలిసి తట్టుకోలేక, ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే శ్రావణి మృతి చెందిందని వైద్యులు ధృవీకరించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

