వరంగల్ CKM ఆసుపత్రిలో ఎలుకల బీభత్సం: పసికందులకు రక్షణ కరువు!

naveen
By -

ఆసుపత్రి అంటే ప్రాణాలు పోయాల్సిన చోటు.. కానీ అక్కడ పసిబిడ్డలను కాపాడుకోవాలంటే తల్లులు రాత్రంతా నిద్రపోకుండా కాపలా కాయాల్సిందే! వరంగల్ ప్రసూతి ఆసుపత్రిలో చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవడం ఖాయం.


Rats running near an incubator in a hospital ward in Warangal.


వరంగల్ నగరంలోని సికేఎం (CKM) ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి పరిస్థితి దారుణంగా తయారైంది. ఇన్ పేషెంట్ వార్డుల్లో, మరీ ముఖ్యంగా పసిపిల్లల ఆరోగ్యం మెరుగుపడేందుకు చికిత్స అందించే 'ఇంక్యుబేటర్' గదిలో మూషిక సేనలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. తల్లులు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, ఈ ఎలుకలు పసికందులపై దాడి చేసి రక్కి గాయపరుస్తున్నాయి. దీంతో బాలింతలు, వారి సహాయకులు బిడ్డల ప్రాణాల కోసం కంటి మీద కునుకు లేకుండా ఎలుకల నుంచి కాపలా కాయాల్సిన దుస్థితి ఏర్పడింది.


గతంలోనూ దాడులు.. ఎంజీఎం సీన్ రిపీట్?

ఇక్కడ ఎలుకల బెడద కొత్తేమీ కాదు. గతంలోనూ ఇవి చిన్నారులను రక్కిన ఘటనలు, బాలింతల కాళ్లు, గోర్లు కొరికిన సందర్భాలు కోకొల్లలు. గతంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకల దాడి ఘటన అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో, ఏకంగా ఒక సూపరింటెండెంట్ పదవికే ఎసరు తెచ్చిందో అందరికీ తెలిసిందే. దురదృష్టవశాత్తు ఇప్పుడు సికేఎం ఆసుపత్రిలోనూ సరిగ్గా అదే సీన్ రిపీట్ అవుతోంది.


ఆసుపత్రిలో రోగులు ఎదుర్కొంటున్న నరకం ఇదీ:

  • శానిటేషన్ నిర్వహణ కోసం లక్షల నిధులు ఖర్చు చేస్తున్నా, పారిశుధ్యం గాలికి వదిలేశారు.

  • గర్భిణీలు, బాలింతలు ఈ ఆసుపత్రి పేరు చెప్తేనే గజగజ వణికిపోయే పరిస్థితి నెలకొంది.

  • ఇంక్యుబేటర్ వార్డులో ఎలుకలు దర్జాగా తిరుగుతున్నా సిబ్బంది నిర్లక్ష్యం మాత్రం వీడటం లేదు.


వీడియో తీసిన తండ్రి.. అధికారి రియాక్షన్

తన బిడ్డ పడుతున్న బాధ చూడలేక, ఇంక్యుబేటర్ వార్డులో ఉన్న ఓ తండ్రి ఈ ఎలుకల విహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా బయటపెట్టడంతో అధికారుల్లో చలనం వచ్చింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీదేవి దీనిపై స్పందిస్తూ, ఎలుకల సమస్య తమ దృష్టికి వచ్చిందని అంగీకరించారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి, ఆసుపత్రిని ఎలుకల బారి నుంచి రక్షిస్తామని హామీ ఇచ్చారు. చిన్న నిర్లక్ష్యం ప్రభుత్వానికే చెడ్డపేరు తెస్తోందన్న విషయాన్ని సిబ్బంది ఇప్పటికైనా గ్రహించి చర్యలు చేపట్టాల్సి ఉంది.


Tags:

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!