మదురో కోసం రక్తపాతం: 32 మంది క్యూబన్ల బలి! అమెరికా 'మెరుపు దాడి' వెనుక అసలు కథ ఇదే!
ఒక దేశ అధ్యక్షుడిని పట్టుకోవడానికి అమెరికా చేసిన 'సర్జికల్ స్ట్రైక్' తరహా ఆపరేషన్.. ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనానికి, తీవ్ర విషాదానికి దారితీసింది. వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించే క్రమంలో జరిగిన పోరులో ఏకంగా 32 మంది క్యూబా సైనికులు, నిఘా అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని క్యూబా ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది.
మదురోను కాపాడటానికి తమ వీరులు ఆఖరి శ్వాస వరకు పోరాడారని చెబుతూ.. జనవరి 5, 6 (నేడు, రేపు) తేదీలను క్యూబా 'దేశవ్యాప్త సంతాప దినాలు'గా ప్రకటించింది. ఈ ఆపరేషన్ కేవలం ఒక వ్యక్తి అరెస్టుతో ముగియలేదు, అది ఇప్పుడు అమెరికా-క్యూబా మధ్య దౌత్యపరమైన యుద్ధానికి తెరలేపింది.
వెనిజులాలో మదురో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన వ్యక్తిగత భద్రతను క్యూబా ప్రత్యేక దళాలే పర్యవేక్షిస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున కరాకస్‌లో అమెరికా కమెండోలు మెరుపు దాడి చేసినప్పుడు.. ఈ క్యూబన్ దళాలు వారికి అడ్డుగా నిలిచాయి. "ఆక్రమణదారులకు వ్యతిరేకంగా జరిగిన ప్రత్యక్ష పోరాటంలో, బాంబు దాడుల్లో మా సైనికులు వీరోచితంగా పోరాడి మరణించారు" అని క్యూబా ప్రభుత్వం ఒక భావోద్వేగ ప్రకటన విడుదల చేసింది.
ఒక దేశాధినేతను మరో దేశం ఇలా అపహరించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని హవానా (క్యూబా రాజధాని) మండిపడింది. అయితే, దాడి సమయంలో అక్కడ మొత్తం ఎంతమంది క్యూబన్లు ఉన్నారనే దానిపై స్పష్టత లేదు కానీ, జరిగిన ప్రాణనష్టం మాత్రం భారీగానే ఉంది.
ఈ ఆపరేషన్ హాలీవుడ్ సినిమాను తలపించింది. 63 ఏళ్ల మదురోను, ఆయన భార్య సీలియా ఫ్లోరస్‌ను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకుని, వెంటనే ప్రత్యేక విమానంలో అమెరికాకు తరలించాయి. ప్రస్తుతం మదురో న్యూయార్క్‌లోని ఒక డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నారు. సోమవారం ఆయన్ను మాన్హాటన్ ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్నారు.
అమెరికా చట్టాల ప్రకారం ఆయనపై 'నార్కో-టెర్రరిజం' (మాదకద్రవ్యాల ఉగ్రవాదం) అభియోగాలు మోపారు. మదురో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అమెరికాలోకి వేల టన్నుల కొకైన్‌ను సరఫరా చేసే ముఠాలకు సహకరించారన్నది ట్రంప్ యంత్రాంగం ప్రధాన ఆరోపణ. అయితే, ఈ ఆరోపణలన్నీ అబద్ధమని మదురో ఖండిస్తూనే ఉన్నారు.
బాటమ్ లైన్..
మదురో అరెస్ట్ ఒక ఎత్తయితే.. క్యూబన్ల మరణం అంతర్జాతీయ రాజకీయాలను మరో మలుపు తిప్పింది.
క్యూబా ఎంట్రీ: ఇన్నాళ్లూ ఇది అమెరికా-వెనిజులా గొడవ. ఇప్పుడు ఇందులో క్యూబా రక్తం చిందింది. ఇది లాటిన్ అమెరికాలో అమెరికా వ్యతిరేకతను మరింత పెంచే అవకాశం ఉంది.
అంతర్జాతీయ చట్టాలు: ఒక దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసినట్లుగా తీసుకెళ్లడం, దాన్ని అడ్డుకున్న మరో దేశ సైనికులను చంపడం.. ఇది కచ్చితంగా ఐక్యరాజ్యసమితిలో పెద్ద చర్చకు దారితీస్తుంది. రష్యా, చైనా వంటి దేశాలు దీనిపై ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.
న్యాయ పోరాటం: మదురోను అమెరికా కోర్టులో దోషిగా నిలబెట్టడం అంత సులభం కాదు. ఆయనకు 'సార్వభౌమ రక్షణ' (Sovereign Immunity) వర్తిస్తుందా? లేదా? అనే దానిపై న్యాయ నిపుణుల మధ్య పెద్ద తర్కమే జరగబోతోంది.

