మోదీ నా దోస్త్.. కానీ వ్యాపారంలో రాజీ పడను! ఇండియాపై ట్రంప్ 'టాక్స్' వార్.. అసలు టార్గెట్ రష్యానా?
అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు.. ఉండేది శాశ్వత ప్రయోజనాలు మాత్రమే. ఈ సూత్రాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రుజువు చేశారు. "ప్రధాని మోదీ చాలా మంచి వ్యక్తి, నా గొప్ప స్నేహితుడు" అని ఆకాశానికెత్తేస్తూనే.. మరోవైపు "నా మాట వినకపోతే మాత్రం పన్నుల మోత మోగిస్తా" అని భారత్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ తన వైఖరి మార్చుకోకపోతే, అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ వస్తువులపై అదనపు సుంకాలు (Tariffs) విధిస్తామని ట్రంప్ తేల్చిచెప్పారు.
సోమవారం ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ అనుసరిస్తున్న తటస్థ విధానంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "నన్ను సంతోషంగా ఉంచడం వారికి (భారత్‌కు) చాలా ముఖ్యం. వారు మాతో వ్యాపారం చేస్తున్నారు. కానీ రష్యా విషయంలో మాకు సహకరించకపోతే, మేము చాలా వేగంగా పన్నులు పెంచగలం" అని హెచ్చరించారు.
ఇప్పటికే గత ఏడాది ఆగస్టులో భారత వస్తువులపై అమెరికా ఏకంగా 50 శాతం టారిఫ్ విధించింది. ఇందులో 25 శాతం సాధారణ వాణిజ్య పన్ను కాగా, మిగిలిన 25 శాతం రష్యా ఆయిల్ కొంటున్నందుకు విధించిన జరిమానా. ఇప్పుడు దాన్ని మరింత పెంచుతామని ట్రంప్ బెదిరించడం భారత ఆర్థిక వ్యవస్థకు, ఎగుమతిదారులకు ఆందోళన కలిగించే అంశం.
ట్రంప్ అసలు వ్యూహం చాలా స్పష్టంగా ఉంది. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి. ఉక్రెయిన్ యుద్ధం నడవాలంటే రష్యాకు డబ్బు కావాలి, ఆ డబ్బు చమురు అమ్మకాల ద్వారానే వస్తోంది. భారత్ రికార్డు స్థాయిలో రష్యా ఆయిల్ కొంటూ పుతిన్ ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ ఇస్తోందన్నది ట్రంప్ వాదన.
గతంలో మోదీ ఆయిల్ ఆపేస్తానని తనకు మాటిచ్చారని ట్రంప్ ప్రకటించినా, భారత విదేశాంగ శాఖ (MEA) దాన్ని ఖండించింది. తమ దేశ ఇంధన అవసరాలే తమకు ముఖ్యమని భారత్ తేల్చిచెప్పింది. ఇప్పుడు వెనిజులా చమురు నిల్వలను తన గుప్పిట్లోకి తెచ్చుకున్న ట్రంప్, భారత్‌కు ఆల్టర్నేటివ్ చూపించి రష్యాకు చెక్ పెట్టాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది.
బాటమ్ లైన్ (విశ్లేషణ)..
ట్రంప్ హెచ్చరికలను భారత్ తేలికగా తీసుకోకూడదు. దీని ప్రభావం సామాన్యుడిపై కూడా పడే అవకాశం ఉంది.
ఎగుమతులకు దెబ్బ: అమెరికా అనేది భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. మన వస్త్రాలు (Textiles), రత్నాలు, ఆభరణాలు, ఐటీ సేవలు ఎక్కువగా అక్కడికే వెళ్తాయి. ట్రంప్ పన్నులు పెంచితే, అక్కడ మన వస్తువుల ధరలు పెరుగుతాయి. దీంతో చైనా, బంగ్లాదేశ్ వస్తువులతో మనం పోటీ పడలేం. ఫలితంగా ఇక్కడ ఎగుమతులు తగ్గి, ఆయా రంగాల్లో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది.
ఆయిల్ రాజకీయం: రష్యా నుంచి మనం చౌకగా ఆయిల్ కొంటున్నాం కాబట్టే.. పెట్రోల్ ధరలు ఒక మోస్తరుగా ఉన్నాయి. ఇప్పుడు అమెరికా భయంతో రష్యా ఆయిల్ ఆపేసి, వేరే చోట ఎక్కువ ధరకు కొనాల్సి వస్తే.. ఆ భారం నేరుగా సామాన్యుడి జేబు మీదే పడుతుంది.
ఇండియా స్టాండ్: ఇటు చౌకైన రష్యా ఆయిల్ కావాలి.. అటు అమెరికా మార్కెట్ కావాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం మోదీ ప్రభుత్వానికి కత్తి మీద సాము లాంటిదే.

