"నన్ను పట్టుకుంటావా? రా చూసుకుందాం!" ట్రంప్‌కు కొలంబియా అధ్యక్షుడు మాస్ సవాల్.. మదురో తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఇతనేనా?
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అర్ధరాత్రి ఎత్తుకెళ్లిన ఘటన లాటిన్ అమెరికా దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. 'మా దారికి రాకపోతే మీకూ ఇదే గతి పడుతుంది' అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మెక్సికో, కొలంబియా దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఈ హెచ్చరికలకు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో (Gustavo Petro) భయపడకపోగా, ట్రంప్‌కే ఎదురు సవాల్ విసిరారు. "నన్ను పట్టుకోవాలంటే రా.. నేను ఇక్కడే నీకోసం ఎదురు చూస్తున్నా" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్రరాజ్యం వర్సెస్ కొలంబియా మధ్య యుద్ధ మేఘాలను కమ్ముకునేలా చేశాయి.
వెనిజులా ఆపరేషన్‌ను తీవ్రంగా ఖండించిన గుస్తావో పెట్రో, అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ అమెరికా తమపై బాంబులు వేస్తే, గ్రామీణ రైతులందరూ (కాంపెసినోలు) వేల సంఖ్యలో గెరిల్లాలుగా మారుతారని స్పష్టం చేశారు. "దేశ ప్రజలు ప్రేమించే అధ్యక్షుడిని మీరు బంధించాలని చూస్తే.. వాళ్లు 'జాగ్వార్' (చిరుత) లాగా విరుచుకుపడతారు" అని వార్నింగ్ ఇచ్చారు.
పెట్రో గతం సామాన్యమైనది కాదు. ఆయన ఒకప్పుడు వామపక్ష గెరిల్లా నాయకుడు. 1990లలో ఆయుధాలు వీడి రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ ట్రంప్ రూపంలో ముప్పు రావడంతో.. "నేను మళ్లీ ఆయుధం పట్టనని ప్రమాణం చేశాను.. కానీ నా మాతృభూమి కోసం అవసరమైతే మళ్లీ గన్ పట్టుకుంటాను" అని ఆయన ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
మరోవైపు ట్రంప్ కూడా మాటల దాడిని పెంచారు. కొలంబియాను పాలిస్తున్నది ఒక 'డ్రగ్ డీలర్' అని తీవ్ర ఆరోపణలు చేశారు. "కొలంబియా తీవ్ర అనారోగ్యంతో ఉంది. కోకైన్ తయారు చేసి అమెరికాకు అమ్మడాన్ని ఇష్టపడే ఒక రోగిష్ఠి అక్కడ పాలిస్తున్నాడు. కానీ, అతడు ఎక్కువ కాలం అధికారంలో ఉండలేడు" అని ట్రంప్ హెచ్చరించారు.
కొలంబియాపై కూడా మిలటరీ ఆపరేషన్ చేపట్టడం సమంజసమే అని ఆయన పరోక్ష సంకేతాలు ఇచ్చారు. వాస్తవానికి కోకైన్ ఉత్పత్తిలో కొలంబియా ప్రపంచంలోనే నంబర్ వన్. గతేడాది అక్టోబరులోనే డ్రగ్స్ ఆరోపణలపై పెట్రో, ఆయన కుటుంబ సభ్యులపై ట్రంప్ ఆంక్షలు విధించారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. గతంలో వెనిజులా అధ్యక్షుడు మదురో కూడా ట్రంప్‌కు ఇలాగే సవాల్ విసిరారు. "నేను ఇక్కడే ఉంటాను, రా చూసుకుందాం పిరికివాడా" అని మదురో అన్న వీడియోను, ఆ తర్వాత ఆయన అరెస్ట్ అయిన వీడియోను కలిపి వైట్ హౌస్ ఒక ఎడిటెడ్ క్లిప్‌ను విడుదల చేసింది.
"మదురోకు అవకాశం ఇచ్చాం.. కానీ ఇక లేదు" అని అమెరికా రక్షణ మంత్రి అన్న మాటలు ఇప్పుడు కొలంబియాకు కూడా వర్తిస్తాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. మదురో అరెస్ట్ తర్వాత ట్రంప్ తదుపరి టార్గెట్ కొలంబియానే అని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బాటమ్ లైన్..
ఇది కేవలం ఇద్దరు నాయకుల మధ్య మాటల యుద్ధం కాదు.. లాటిన్ అమెరికా అస్తిత్వ పోరాటం.
గెరిల్లా వార్: వెనిజులాలో మదురోను పట్టుకోవడం ఈజీ అయ్యింది కానీ, కొలంబియాలో అది అంత సులభం కాకపోవచ్చు. అక్కడ దశాబ్దాల పాటు గెరిల్లా పోరాటాల చరిత్ర ఉంది. పెట్రో పిలుపునిస్తే వేల మంది ఆయుధాలు పట్టే ప్రమాదం ఉంది. అప్పుడు అది అమెరికాకు మరో వియత్నాంలా మారొచ్చు.
డ్రగ్స్ రాజకీయం: కొలంబియా డ్రగ్స్ హబ్ అనేది నిజమే. కానీ అమెరికా దీన్ని సాకుగా చూపి, అక్కడ తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని చూస్తోందా? అనే అనుమానాలు ఉన్నాయి.
ట్రంప్ డాక్ట్రిన్: లాటిన్ అమెరికాను తన పెరటి తోటలా మార్చుకోవాలని ట్రంప్ చూస్తున్నారు. మాట వినని వారిని సైన్యంతో లొంగదీసుకోవడమే ఆయన కొత్త పాలసీలా కనిపిస్తోంది.

