వెనిజులా తర్వాత టార్గెట్ గ్రీన్‌లాండ్? అమెరికాకు డెన్మార్క్ మాస్ వార్నింగ్.. నాటో కూటమికి ముప్పు తప్పదా?
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్న ఘటన ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుండగానే.. ఇప్పుడు మరో వివాదం రాజుకుంది. అగ్రరాజ్యం కన్ను ఇప్పుడు మంచు ఖండం గ్రీన్‌లాండ్‌పై పడింది. అయితే, ఈసారి అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
"గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకోవాలని చూస్తే.. నాటో (NATO) సైనిక కూటమి అంతం కాక తప్పదు" అని డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సెన్ (Mette Frederiksen) అమెరికాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మిత్రదేశాల మధ్యే ఇలాంటి యుద్ధ వాతావరణం నెలకొనడం అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్కిటిక్ ద్వీపమైన గ్రీన్‌లాండ్‌ను అమెరికా ఆధీనంలోకి తేవాలని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. "మరో 20 రోజుల్లో గ్రీన్‌లాండ్ గురించి మాట్లాడతాను" అని ఆయన విలేకరులతో అనడం, వెనిజులా ఆపరేషన్ జరిగిన మరుసటి రోజే ఈ వ్యాఖ్యలు చేయడం డెన్మార్క్‌ను అప్రమత్తం చేసింది.
గ్రీన్‌లాండ్ అనేది డెన్మార్క్ రాజ్యంలో భాగమైన ఒక స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతం. డెన్మార్క్ నాటోలో సభ్యదేశం కాబట్టి, గ్రీన్‌లాండ్‌పై దాడి జరిగితే అది నాటో ఒప్పందాలకు విరుద్ధం. "ఒకవేళ అమెరికా మరో నాటో దేశంపై సైనిక దాడికి దిగితే.. అక్కడితో అంతా ముగిసిపోతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మనకు రక్షణగా నిలిచిన నాటో కూటమి ఉనికి కోల్పోతుంది" అని డెన్మార్క్ ప్రధాని స్పష్టం చేశారు.
పరిస్థితిని మరింత దిగజార్చేలా.. ట్రంప్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ భార్య కేటీ మిల్లర్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వివాదాస్పదమైంది. గ్రీన్‌లాండ్ మ్యాప్‌ను అమెరికా జెండా రంగుల్లో చూపిస్తూ.. పైన "SOON" (త్వరలో) అని క్యాప్షన్ పెట్టారు. దీనిపై గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్-ఫ్రెడరిక్ నీల్సెన్ తీవ్రంగా స్పందించారు. ఇది తమను అగౌరవపరచడమేనని, దేశాల మధ్య సంబంధాలు పరస్పర గౌరవంతో ఉంటాయని, సోషల్ మీడియా పోస్టులతో కాదని హితవు పలికారు. "మా దేశం అమ్మకానికి లేదు. అలాగని మేము భయపడటం లేదు. అమెరికా రాత్రికి రాత్రి మా దేశాన్ని ఆక్రమించుకోలేదు" అని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.
అసలు అమెరికాకు గ్రీన్‌లాండ్ ఎందుకు కావాలంటే.. దాని భౌగోళిక స్థానమే కారణం. యూరప్, ఉత్తర అమెరికా మధ్య ఉన్న ఈ ద్వీపం క్షిపణి రక్షణ వ్యవస్థకు (Ballistic Missile Defence) అత్యంత కీలకం. అంతేకాకుండా అక్కడ అపారమైన ఖనిజ సంపద ఉంది. చైనా ఎగుమతులపై ఆధారపడకుండా ఉండటానికి గ్రీన్‌లాండ్ వనరులు అమెరికాకు అవసరం.
"గ్రీన్‌లాండ్ చుట్టూ రష్యా, చైనా నౌకలు తిరుగుతున్నాయి. జాతీయ భద్రత దృష్ట్యా మాకు గ్రీన్‌లాండ్ కావాలి. దాన్ని రక్షించడం డెన్మార్క్ వల్ల కాదు" అని ట్రంప్ వాదిస్తున్నారు. గత నెలలో లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీని గ్రీన్‌లాండ్ ప్రత్యేక రాయబారిగా నియమించడం కూడా అమెరికా వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది.
బాటమ్ లైన్..
ఇది కేవలం భూభాగం కోసం జరుగుతున్న గొడవ కాదు.. ప్రపంచ భద్రతా వ్యవస్థకు సవాలు.
నాటో భవిష్యత్తు: నాటో అనేది "ఒకరిపై దాడి అందరిపై దాడి" (Article 5) అనే సూత్రంపై నడుస్తుంది. అలాంటిది కూటమిలోని పెద్దన్న (అమెరికా).. మరో సభ్య దేశం (డెన్మార్క్) భూభాగాన్ని ఆక్రమించాలని చూస్తే.. ఆ కూటమికి అర్థం ఉండదు. ఇది రష్యా, చైనాలకు బలాన్నిస్తుంది.
వనరుల యుద్ధం: వెనిజులాలో ఆయిల్ కోసం ఎలాగైతే దూకుడు ప్రదర్శించారో.. గ్రీన్‌లాండ్‌లో ఖనిజాల కోసం అదే చేస్తున్నారు. ట్రంప్ 'అమెరికా ఫస్ట్' విధానం మిత్రదేశాలను కూడా శత్రువులుగా మారుస్తోంది.
సార్వభౌమాధికారం: డబ్బు, సైన్యం ఉంటే ఏ దేశాన్నైనా కొనొచ్చు లేదా ఆక్రమించొచ్చు అనే ధోరణి ప్రమాదకరం. గ్రీన్‌లాండ్ ప్రధాని చెప్పినట్లు.. దేశాలు అమ్మకానికి ఉండవు.

