అమెరికా కోర్టులో వెనిజులా మాజీ అధ్యక్షుడు.. రంగంలోకి 'వికీలీక్స్' లాయర్! మదురోను ఆ అపర మేధావి కాపాడగలరా?
వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో కథ ముగిసిందని అందరూ అనుకున్నారు. అమెరికా సైన్యం మెరుపు దాడి, అరెస్ట్, న్యూయార్క్ కోర్టులో హాజరు.. ఇవన్నీ చూస్తే ఆయనకు జీవిత ఖైదు ఖాయమనిపించింది. కానీ, ఇక్కడే ఒక సంచలన మలుపు చోటుచేసుకుంది. న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో మదురో తరఫున వాదించడానికి అమెరికాలోనే అత్యంత ప్రసిద్ధ లాయర్ బారీ జె. పొలాక్ (Barry J Pollack) రంగంలోకి దిగారు. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌ను అమెరికా ప్రభుత్వం నుంచి విడిపించిన చరిత్ర పొలాక్ సొంతం. దీంతో ఈ కేసు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సోమవారం మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరస్‌ను భారీ భద్రత నడుమ హెలికాప్టర్ నుంచి ఆర్మర్డ్ వెహికల్‌లో న్యూయార్క్ కోర్టుకు తరలించారు. కోర్టులో నిలబడ్డ మదురో.. తనపై మోపిన నార్కో-టెర్రరిజం, కొకైన్ స్మగ్లింగ్, ఆయుధాల అక్రమ రవాణా ఆరోపణలను ఖండించారు. "నేను నిర్దోషిని (Not Guilty)" అని న్యాయమూర్తి ముందు స్పష్టం చేశారు. మదురోపై ఉన్నవి సామాన్యమైన కేసులు కాదు. అమెరికాలోకి వేల టన్నుల కొకైన్ పంపించారని, ఉగ్రవాద ముఠాలతో చేతులు కలిపారని తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో మదురో నమ్ముకున్నది బారీ పొలాక్‌నే.
ఎవరీ బారీ పొలాక్? ఎందుకింత హైప్?
బారీ పొలాక్ అంటే అమెరికా న్యాయ వ్యవస్థలో ఒక బ్రాండ్. హారిస్ సెయింట్ లారెంట్ & వెచ్స్లర్ ఎల్‌ఎల్‌పీ అనే ప్రముఖ న్యాయ సంస్థలో ఆయన పార్ట్నర్. 30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న పొలాక్.. క్లిష్టమైన క్రిమినల్ కేసులు, వైట్ కాలర్ నేరాలు, జాతీయ భద్రతకు సంబంధించిన కేసులను డీల్ చేయడంలో దిట్ట. ఇండియానా యూనివర్సిటీ, జార్జ్‌టౌన్ లా సెంటర్‌లో చదువుకున్న పొలాక్.. కెరీర్ ఆరంభంలో పేదలకు న్యాయం చేసే పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేశారు. నేడు వాషింగ్టన్, న్యూయార్క్‌లలో అత్యంత ఖరీదైన లాయర్లలో ఒకరు.
అసాధ్యాలను సుసాధ్యం చేసిన ట్రాక్ రికార్డ్:
జూలియన్ అసాంజ్: వికీలీక్స్ ద్వారా అమెరికా రహస్యాలను బట్టబయలు చేసిన అసాంజ్‌కు జైలు శిక్ష పడకుండా, 2024లో 'ప్లీ డీల్' (ఒప్పందం) కుదిర్చి ఆయన విడుదలకు కారణమైంది ఈయనే.
ఎన్‌రాన్ కుంభకోణం: ప్రపంచాన్ని కుదిపేసిన ఎన్‌రాన్ కేసులో.. అకౌంటింగ్ డైరెక్టర్ మైఖేల్ క్రాట్జ్‌ను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చారు.
మార్టిన్ ట్యాంక్లెఫ్: చేయని నేరానికి 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన మార్టిన్ ట్యాంక్లెఫ్ కేసును తిరగదోడి.. అతను నిర్దోషి అని నిరూపించడమే కాకుండా, ప్రభుత్వంతో రూ. 110 కోట్లు (13.4 మిలియన్ డాలర్లు) నష్టపరిహారం ఇప్పించారు.
బాటమ్ లైన్..
ఇది కేవలం మదురో విచారణ కాదు.. అమెరికా ప్రభుత్వానికి, ఒక సూపర్ లాయర్‌కు మధ్య జరగబోయే యుద్ధం.
ట్రంప్ సర్కార్‌కు సవాల్: మదురోను దోషిగా నిరూపించడానికి అమెరికా దగ్గర బలమైన ఆధారాలు ఉండొచ్చు. కానీ, వాటిలోని లొసుగులను వెతికి పట్టుకోవడంలో పొలాక్ సిద్ధహస్తుడు. ఈ కేసు అంత త్వరగా తెలేది కాదు.
స్ట్రాటజీ: పొలాక్ నియామకం చూస్తుంటే.. మదురో న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారని అర్థమవుతోంది. అసాంజ్ విషయంలో లాగే.. ఏదైనా ఒప్పందం (Plea Bargain) ద్వారా శిక్ష తగ్గించుకునే ప్రయత్నం కూడా జరగొచ్చు.
రాజకీయం: ఒకవేళ పొలాక్ తన వాదనలతో అమెరికా గూఢచర్య వైఫల్యాలను లేదా అరెస్ట్ విధానంలోని లోపాలను బయటపెడితే.. అది అంతర్జాతీయంగా అమెరికాకు ఇబ్బందికరంగా మారవచ్చు.

