అమెరికా దాడి చేస్తే మేం చూస్తూ కూర్చోం.. తిరగబడతాం! డెన్మార్క్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. నాటో కథ కంచికి చేరినట్టేనా?
ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని విచిత్రం ఇది. ప్రపంచానికి రక్షణగా నిలుస్తుందనుకున్న నాటో (NATO) కూటమి.. ఇప్పుడు తన సొంత సభ్య దేశాల మధ్యే యుద్ధానికి వేదికవుతోందా? గ్రీన్‌లాండ్ (Greenland) కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హడావిడి చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. "అమెరికా గనక గ్రీన్‌లాండ్‌పై సైనిక దాడికి దిగితే.. మేము కచ్చితంగా ఎదురుదాడి చేస్తాం" అని డెన్మార్క్ ఎంపీ, రక్షణ కమిటీ ఛైర్మన్ రాస్మస్ జార్లోవ్ (Rasmus Jarlov) ప్రకటించారు. అమెరికా సైన్యాన్ని ఆపే శక్తి తమకు లేదని తెలిసినా సరే.. తమ ఆత్మగౌరవం కోసం పోరాడుతామని ఆయన ఎన్డీటీవీ (NDTV)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
జార్లోవ్ వ్యాఖ్యలు ప్రస్తుత ఉద్రిక్తతకు అద్దం పడుతున్నాయి. "మాపై సైనిక దాడి చేయడం ఆమోదయోగ్యం కాదు. ఇది రెండు నాటో దేశాల మధ్య యుద్ధానికి దారి తీస్తుంది. ఇది చాలా తెలివితక్కువ, అసంబద్ధమైన, వినాశకరమైన చర్య అవుతుంది" అని ఆయన హెచ్చరించారు. గ్రీన్‌లాండ్‌లో మైనింగ్ చేయడానికి, రక్షణ కార్యకలాపాలకు అమెరికాకు ఇప్పటికే అనుమతి ఉందని, అలాంటప్పుడు యుద్ధం చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. "అక్కడ మాకు అమెరికాతో డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది. వాళ్లు మైనింగ్ చేసుకోవచ్చు. కానీ దేశాన్ని ఆక్రమిస్తామంటే కుదరదు" అని తేల్చిచెప్పారు.
"మనుషులు అమ్మకానికి లేరు"
ట్రంప్ 2019లో గ్రీన్‌లాండ్‌ను కొంటానన్నప్పుడు డెన్మార్క్ నో చెప్పింది. ఇప్పుడు 2024లో గెలిచాక మళ్లీ అదే పల్లవి ఎత్తుకున్నారు. దీనిపై జార్లోవ్ ఘాటుగా స్పందించారు. "గ్రీన్‌లాండ్ అనేది అమ్మకానికి ఉన్న వస్తువు కాదు. మా దేశానికి ఇది డబ్బుతో కూడిన వ్యవహారం కాదు. 57,000 మంది డానిష్ పౌరులను (Danish Citizens) అమెరికన్లుగా మార్చడానికి మేము వారిని అమ్మలేము. వారు మనుషులు.. వస్తువులు కాదు" అని స్పష్టం చేశారు.
నాటోకు 'ఆర్టికల్ 5' గండం:
డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సెన్ కూడా ఇదే విషయాన్ని హెచ్చరించారు. ఒకవేళ అమెరికా దాడి చేస్తే.. 76 ఏళ్ల నాటో కూటమి అంతమైనట్టేనని ఆమె అన్నారు. నాటో 'ఆర్టికల్ 5' (Article 5) ప్రకారం.. ఒక సభ్య దేశంపై దాడి జరిగితే, మిగతా దేశాలన్నీ ఆ దేశాన్ని కాపాడాలి. "అమెరికా మాపై దాడి చేస్తే.. మేము నాటో సాయం కోరుతాం. అప్పుడు అమెరికా నుంచి మమ్మల్ని కాపాడటానికి మిగతా దేశాలు రావాలి. కానీ అమెరికా దాన్ని వీటో చేస్తుంది. అప్పుడు నాటో చనిపోతుంది" అని డెన్మార్క్ వాదన వినిపిస్తోంది.
మరోవైపు వైట్ హౌస్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవడానికి సైనిక చర్య (Military Force) కూడా ఒక ఆప్షన్ అని ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్కిటిక్ ప్రాంతంలో శత్రువులను అడ్డుకోవడానికి గ్రీన్‌లాండ్ అమెరికాకు అత్యవసరమని ఆమె అంటున్నారు. అయితే, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం.. వచ్చే వారం డెన్మార్క్ అధికారులతో చర్చలు జరుపుతామని, తాము కొనాలనుకుంటున్నామే తప్ప యుద్ధం చేయాలనుకోవడం లేదని కవర్ చేసే ప్రయత్నం చేశారు.
బాటమ్ లైన్ (విశ్లేషణ)..
మిత్రదేశాల మధ్య యుద్ధం అనేది ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైన సంకేతం.
నాటో భవితవ్యం: రష్యా, చైనాలను అడ్డుకోవడానికి పుట్టిన నాటో.. ఇప్పుడు అమెరికా ఆధిపత్య పోరులో చిక్కుకుంది. సొంత మిత్రదేశాన్నే అమెరికా ఆక్రమిస్తే.. ఇక మిగతా దేశాలకు నాటోపై నమ్మకం పోతుంది. ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు పండగ లాంటి వార్త.
ట్రంప్ రియల్ ఎస్టేట్ మైండ్‌సెట్: దేశాలను, భూభాగాలను రియల్ ఎస్టేట్ వెంచర్లలా చూడటం ట్రంప్ నైజం. డబ్బు ఇస్తే ఏదైనా కొనొచ్చు అనే వ్యాపార ధోరణి.. సార్వభౌమాధికారం (Sovereignty) అనే కాన్సెప్ట్‌కు విరుద్ధం.
డెన్మార్క్ ఆత్మగౌరవం: చిన్న దేశమే అయినా.. అగ్రరాజ్యానికి ఎదురుతిరిగిన డెన్మార్క్ తీరు ప్రశంసనీయం. 57 వేల మంది పౌరుల కోసం యుద్ధానికైనా సిద్ధం అనడం వారి దేశభక్తికి నిదర్శనం.
