డెలివరీ బాయ్‌గా మారిన రాఘవ్ చద్దా! 10 నిమిషాల డెలివరీపై ఆప్ నేత నిరసన? వీడియో వైరల్!
రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) యువనేత రాఘవ్ చద్దా (Raghav Chadha) సరికొత్త అవతారం ఎత్తారు. రాజకీయాలను, పార్లమెంట్ సమావేశాలను కాసేపు పక్కనపెట్టి, సామాన్య డెలివరీ బాయ్ (Delivery Rider) వేషధారణలో రోడ్డెక్కారు. బ్లింకిట్ (Blinkit) యూనిఫాం వేసుకుని, వీపున డెలివరీ బ్యాగ్ తగిలించుకుని కస్టమర్ల ఇళ్లకు సరుకులు పంపిణీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (ట్విట్టర్)లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో రాఘవ్ చద్దా బ్లింకిట్ టీషర్ట్ వేసుకోవడం, మరో డెలివరీ బాయ్ వెనకాల బైక్ మీద కూర్చోవడం, స్టోర్ నుంచి సరుకులు తీసుకుని కస్టమర్ ఇంటికి వెళ్లడం కనిపిస్తుంది. లిఫ్ట్ నుంచి దిగి కస్టమర్ ఇంటి తలుపు తట్టడంతో వీడియో ముగుస్తుంది. చివర్లో "స్టే ట్యూన్డ్" (Stay Tuned) అని రాసి ఉండటంతో, గిగ్ వర్కర్ల సమస్యలపై ఆయన ఏదో పెద్ద క్యాంపెయిన్ ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది.
ఎందుకు ఈ వేషధారణ?
ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ కాదు. గిగ్ వర్కర్ల (Gig Workers) కష్టాలను, వారి పని పరిస్థితులను కళ్లారా చూడటానికే ఆయన ఇలా చేశారు.
10 నిమిషాల డెలివరీపై యుద్ధం: క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఇస్తున్న "10 నిమిషాల్లో డెలివరీ" హామీని రాఘవ్ చద్దా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల డెలివరీ బాయ్స్ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, వారిపై విపరీతమైన ఒత్తిడి ఉంటోందని, వారి భద్రత గాలిలో కలుస్తోందని ఆయన వాదిస్తున్నారు.
రోబోలు కాదు, మనుషులు: గతంలో రాజ్యసభలోనూ ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. "వాళ్లు రోబోలు కాదు.. వాళ్లకు కుటుంబాలు ఉంటాయి. కేవలం మన సౌకర్యం కోసం వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు. ఈ 10 నిమిషాల డెలివరీ పద్ధతి క్రూరమైనది" అని ఘాటుగా విమర్శించారు.
సమ్మెకు మద్దతు: డిసెంబర్ 31న తెలంగాణ గిగ్ వర్కర్ల యూనియన్ (TGPWU) సహా పలు సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మె చేసినప్పుడు, చద్దా వారితో గడిపారు. న్యాయమైన వేతనాలు, సామాజిక భద్రత కోసం డిమాండ్ చేశారు. ఇటీవల ఒక డెలివరీ బాయ్ 28 ఆర్డర్లు డెలివరీ చేస్తే కేవలం రూ. 762 మాత్రమే వచ్చాయని ఒక పోస్ట్ కూడా పెట్టారు.
Away from boardrooms, at the grassroots. I lived their day.
— Raghav Chadha (@raghav_chadha) January 12, 2026
Stay tuned! pic.twitter.com/exGBNFGD3T
బాటమ్ లైన్..
ఏసీ గదుల్లో కూర్చుని ఫోన్లో ఆర్డర్ పెట్టే మనకు.. ఆ ఆర్డర్ తెచ్చే వాడి కష్టం తెలియదు. ఆ 'హ్యూమన్ కాస్ట్' (Human Cost)ని ప్రపంచానికి చెప్పడానికే ఎంపీ గారు బ్యాగ్ మోశారు.
వేగం వద్దు, ప్రాణం ముద్దు: 10 నిమిషాల్లో సరుకులు రాకపోతే ఏమీ మునిగిపోదు. కానీ ఆ తొందరలో డెలివరీ బాయ్ ప్రమాదానికి గురైతే ఒక కుటుంబం రోడ్డున పడుతుంది.
చట్టాలు అవసరం: గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు, బీమా వంటి చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని ఈ వీడియో మరోసారి గుర్తుచేస్తోంది.

