నిన్నటి వరకు "అమ్మయ్యా, బంగారం ధర కాస్త తగ్గింది" అని ఊపిరి పీల్చుకున్నారా? అయితే ఇప్పుడు మీకు ఒక పెద్ద షాక్. ఈరోజు (జనవరి 23, శుక్రవారం) ఉదయం లేచేసరికి బంగారం, వెండి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లిపోయాయి. కేవలం 4 గంటల వ్యవధిలో జరిగిన ఈ భారీ మార్పు చూసి మార్కెట్ నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. బంగారం తులంపై రూ. 5000 కు పైగా పెరిగితే, వెండి ఏకంగా రూ. 20,000 పెరిగి రికార్డు సృష్టించింది. అసలు ఉదయం 6 గంటలకు ఉన్న రేటుకు, 10 గంటలకు ఉన్న రేటుకు ఇంత తేడా ఎందుకు వచ్చింది? ప్రస్తుతం హైదరాబాద్ లో రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
నాలుగు గంటల్లో రూ. 5,400 జంప్
ఈరోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,54,300 గా ఉండేది. కానీ మార్కెట్ మొదలైన 4 గంటల్లోనే, అంటే ఉదయం 10 గంటల కల్లా అది రూ. 1,59,710 కి చేరింది. అంటే ఒక్క రోజులో, అదీ కొన్ని గంటల్లోనే రూ. 5,410 పెరిగిందన్నమాట. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఉదయం రూ. 1,41,450 ఉండగా, ఇప్పుడు రూ. 1,46,400 కి చేరింది.
వెండి రేటు.. నమ్మశక్యం కాని నిజం
బంగారం దారిలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది, కాదు కాదు.. ఎగురుతోంది! ఈరోజు వెండి ధరలో వచ్చిన మార్పు కనీవినీ ఎరుగనిది. కేజీ వెండిపై ఏకంగా రూ. 20,000 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 3,46,000 గా కొనసాగుతోంది. మునుపెన్నడూ వెండి ధర ఇంత భారీగా పెరిగిన దాఖలాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు.
విజయవాడ, విశాఖలో పరిస్థితి
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,59,710 వద్ద, 22 క్యారెట్ల ధర రూ. 1,46,400 వద్ద కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ. 1,59,860 కాగా, చెన్నైలో రూ. 1,59,820 గా ఉంది.
ఇది కొనే సమయం కాదు.. చూసే సమయం!
ప్రస్తుత మార్కెట్ పరిస్థితి చూస్తుంటే బంగారం, వెండి ఇక సామాన్యుడికి అందని ద్రాక్షే అనిపిస్తోంది. ఇంత భారీ ఒడిదుడుకులు ఉన్నప్పుడు కొనుగోలు చేయడం కంటే, ధరలు స్థిరపడే వరకు వేచి చూడటమే ఉత్తమం. పెళ్లిళ్ల సీజన్ ఉన్నవారికైతే ఇది నిజంగా పెద్ద ఎదురుదెబ్బే.

