1000 రూపాయల టికెట్.. 45 నిమిషాల్లో 25 లక్షలు! అదృష్టం అంటే ఇదేనేమో.. చివరి నిమిషంలో జాక్‌పాట్!
అదృష్టం తలుపు తట్టదు, ఒక్కోసారి బద్దలుకొట్టుకుని వస్తుందంటారు. పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లాలో జరిగిన సంఘటన చూస్తే ఈ మాట అక్షరాలా నిజమనిపిస్తుంది. 2026 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ, ఒక సామాన్యుడి తలరాత కేవలం ముప్పావు గంటలో మారిపోయింది. జేబులో నుంచి వెయ్యి రూపాయలు తీసి ఒక లాటరీ టికెట్ కొన్నాడు. సరిగ్గా 45 నిమిషాల తర్వాత చూసుకుంటే, ఆ వెయ్యి రూపాయలు ఏకంగా 25 లక్షల రూపాయలుగా మారిపోయాయి. సినిమాను తలపించేలా జరిగిన ఈ రియల్ లైఫ్ జాక్‌పాట్ స్టోరీ ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
పంజాబ్‌లోని రూప్‌నగర్ స్థానిక 'అశోక లాటరీ' దుకాణంలో ఈ అద్భుతం జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించిన 'గోల్డెన్ లాటరీ' బంపర్ డ్రా కోసం టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. డ్రా తీయడానికి సమయం దగ్గరపడుతోంది. సరిగ్గా ఫలితాలు వెల్లడించడానికి కేవలం 45 నిమిషాల ముందు ఒక వ్యక్తి ఆ దుకాణానికి వచ్చాడు. రూ. 1,000 పెట్టి ఒక టికెట్ కొనుగోలు చేశాడు. యాదృశ్చికంగా అది ఆ దుకాణంలో మిగిలి ఉన్న చివరి టికెట్లలో ఒకటి. ఆ వ్యక్తి టికెట్ జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్లేలోపే డ్రా ఫలితాలు వచ్చేశాయి. ఆశ్చర్యకరంగా అతను చివరి నిమిషంలో కొన్న టికెట్‌కే మొదటి బహుమతి అయిన రూ. 25 లక్షలు వరించింది.
ఊహించని విధంగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకోవడంతో సదరు విజేత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే, ఇక్కడ ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం అందరినీ ఆకర్షించింది. సాధారణంగా లాటరీ గెలిచిన వారు మీడియా ముందుకు వచ్చి ఫోటోలకు ఫోజులిస్తారు. కానీ ఈ విజేత మాత్రం తన వివరాలు బయటకు రాకూడదని, తన ముఖం ఎవరూ చూడకూడదని లాటరీ నిర్వాహకులకు స్పష్టం చేశారు. వ్యక్తిగత భద్రత, ప్రైవసీ కారణాల రీత్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నిర్వాహకులు కూడా ఆయన వివరాలను గోప్యంగా ఉంచారు. కానీ విజేతకు సంబంధించిన అన్ని అధికారిక పత్రాలు సరిగ్గా ఉన్నాయని ధృవీకరించారు.
మరోవైపు అశోక లాటరీ నిర్వాహకులు కూడా ఈ గెలుపు పట్ల ఫుల్ ఖుషీగా ఉన్నారు. గత ఏడాది కూడా తమ దుకాణం నుంచే ఒక భారీ ప్రైజ్ మనీ టికెట్ అమ్ముడైందని, ఇప్పుడు మళ్లీ రూ. 25 లక్షల జాక్‌పాట్ తమ కస్టమర్‌కే రావడం తమ దుకాణానికి మంచి పేరు తెచ్చిందని వారు సంబరపడిపోతున్నారు. రోపర్ జిల్లాలో తమది ప్రభుత్వ గుర్తింపు పొందిన నమ్మకమైన సెంటర్ అని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా, కేవలం వెయ్యి రూపాయల పెట్టుబడితో, అదీ చివరి నిమిషంలో తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఆ సామాన్యుడి జీవితంలో 25 లక్షల వెలుగులు నింపడం నిజంగా విశేషమే.
బాటమ్ లైన్..
లాటరీ అనేది ఆశల పల్లకి. కానీ ఈ ఘటనలో మనం గమనించాల్సింది విజేత విజ్ఞతను.
ప్రైవసీ ముఖ్యం: అకస్మాత్తుగా డబ్బు వస్తే.. చుట్టూ జనం, అప్పులు అడిగేవాళ్లు, దొంగల భయం కూడా చుట్టుముడుతుంది. అందుకే ఆ వ్యక్తి మీడియా ముందుకు రాకుండా తీసుకున్న నిర్ణయం చాలా తెలివైనది. ప్రపంచానికి తెలియకుండానే తన జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకోవడం మెచ్యూరిటీకి నిదర్శనం.
టైమింగ్: జీవితంలో కొన్నిసార్లు మనం తీసుకునే చివరి నిమిషం నిర్ణయాలే (Last Minute Decisions) అద్భుతాలు సృష్టిస్తాయి. అతను ఆ 45 నిమిషాల ముందు ఆగిపోయుంటే.. ఈ అదృష్టం మరొకరిని వరించేది.
హెచ్చరిక: ఇది చదివి అందరూ లాటరీ టికెట్లు కొనమని చెప్పడం ఉద్దేశం కాదు. అదృష్టం అనేది వస్తే కొండంత, రాకపోతే ఖాళీ జేబు. కాబట్టి ఆశ ఉండాలి కానీ, అత్యాశ పనికిరాదు.

