లైక్స్, డబ్బు కోసం ప్రాణాలతో చెలగాటం: లైవ్ స్ట్రీమ్‌లో డ్రగ్స్ తీసుకుని స్ట్రీమర్ మృతి.. తల్లి చూస్తుండగానే విషాదం!
ఇంటర్నెట్ పిచ్చి, ఆన్‌లైన్ క్రేజ్ ఏ స్థాయికి దిగజారిందంటే.. డబ్బు కోసం, వ్యూస్ కోసం ప్రాణాలను పణంగా పెట్టేంతగా! సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే తాపత్రయం ఇప్పుడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది.
స్పెయిన్‌కు చెందిన ఓ 37 ఏళ్ల స్ట్రీమర్ డబ్బు కోసం లైవ్‌లో డ్రగ్స్ తీసుకుని, మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. న్యూ ఇయర్ వేడుకల వేళ జరిగిన ఈ ఘటన డిజిటల్ యుగంలో యువత పోకడలకు అద్దం పడుతోంది.
సెర్గియో జిమెనెజ్ (37) అనే స్పానిష్ యూట్యూబర్/స్ట్రీమర్ డిసెంబర్ 31 రాత్రి ఒక ప్రైవేట్ లైవ్ స్ట్రీమ్ నిర్వహించాడు. డబ్బులు చెల్లించే వ్యూయర్స్ కోసం ఒక ప్రమాదకరమైన 'ఆన్‌లైన్ ఛాలెంజ్' చేపట్టాడు. అదేంటంటే.. కెమెరా ముందే 6 గ్రాముల కొకైన్, ఒక బాటిల్ విస్కీని పూర్తిగా సేవించడం. ఆ ఛాలెంజ్ అతడి పాలిట మరణ శాసనమైంది. మితిమీరిన డ్రగ్స్, ఆల్కహాల్ డోస్ కారణంగా అంబులెన్స్ వచ్చేలోపే అతను ప్రాణాలు విడిచాడు. స్ట్రీమ్ చూస్తున్న వారు డబ్బులిచ్చారు కానీ, అతని ప్రాణాన్ని కాపాడలేకపోయారు.
అతని మరణం వెలుగులోకి వచ్చిన తీరు హృదయ విదారకంగా ఉంది. అతనితో పాటే ఉంటున్న తల్లి తెెరీసా, అర్ధరాత్రి 2 గంటల సమయంలో బాత్రూంకి వెళ్తూ కొడుకు గది వైపు చూసింది. తలుపు సగం తెరిచి ఉండటంతో.. లోపల జిమెనెజ్ మంచంపై తలపెట్టి, నేల మీద మోకాళ్లపై కూర్చుని ఉండటం గమనించింది. "ఏం చేస్తున్నావ్?" అని పిలిచినా పలకలేదు. గదిలో బట్టలు అడ్డంగా ఉండటంతో లోపలికి వెళ్లలేకపోయింది. "అతను మోకాళ్లపై ఉంటే.. బహుశా ప్రార్థన చేస్తున్నాడేమో అనుకున్నాను" అని ఆ తల్లి కన్నీటిపర్యంతమైంది. కానీ అప్పటికే అతను విగతజీవిగా మారాడు. పక్కనే ఖాళీ విస్కీ బాటిల్, ఎనర్జీ డ్రింక్స్, ఎర్రటి ప్లేట్‌లో కొకైన్ ఆనవాళ్లు లభించాయి.
స్పెయిన్‌లో లైవ్ ఛాలెంజ్ కారణంగా నమోదైన తొలి మరణం ఇదేనని భావిస్తున్నారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. గతంలో సైమన్ పెరెజ్ అనే మరో స్ట్రీమర్ వీడియోల్లో డ్రగ్స్ తీసుకుంటూ జిమెనెజ్ పాపులర్ అయ్యాడు. ఈ ఘటనపై స్పందించిన కాటలోనియా పోలీసులు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఇటువంటి ప్రమాదకరమైన ఛాలెంజ్‌లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఇవి ప్రాణాలకు ముప్పు తేవడమే కాకుండా, డిజిటల్ ఫుట్‌ప్రింట్ ద్వారా భవిష్యత్తులో ఉద్యోగ, విద్యావకాశాలను దెబ్బతీస్తాయని స్పష్టం చేశారు. గత ఏడాది ఆగస్టులో కూడా ఫ్రాన్స్‌కు చెందిన జీన్ పోర్మానోవ్ అనే వ్యక్తి ఇలాగే లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో మరణించడం గమనార్హం.
బాటమ్ లైన్..
ఆన్‌లైన్ ఫేమ్ అనేది నీటి మీద బుడగ లాంటిది. దానికోసం జీవితాన్ని బలిపెట్టడం అవివేకం.
వర్చువల్ మత్తు: డబ్బు, లైక్స్ ఇస్తున్న వ్యూయర్స్.. మీ ప్రాణం పోతుంటే కాపాడలేరు. జిమెనెజ్ ఘటన ఇదే నిరూపిస్తోంది. తెర వెనుక ఉన్నవారి వినోదం కోసం తెర ముందు ఉన్నవాడు బలికాకూడదు.
ప్లాట్‌ఫామ్స్ బాధ్యత: ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ కంటెంట్‌ను ప్రసారం చేసే ప్రైవేట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై కఠిన నిఘా అవసరం. డ్రగ్స్, వయోలెన్స్‌ను ఎంకరేజ్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలి.
తల్లిదండ్రుల గమనిక: ఇంట్లో ఉన్నా సరే.. పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో గమనించడం ముఖ్యం. జిమెనెజ్ 37 ఏళ్ల వ్యక్తి అయినా, ఆన్‌లైన్ వ్యసనానికి బానిసయ్యాడు.

