సాధారణంగా చదువురాని వాళ్లు, టెక్నాలజీ తెలియని వాళ్లు సైబర్ నేరగాళ్ల వలలో పడతారని అనుకుంటాం. కానీ, బ్యాంకులో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులే మోసపోతుంటే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడి కేంద్ర మంత్రుల వీడియోలనే మార్ఫింగ్ చేస్తున్నారు. తాజాగా సీపీఐ దివంగత నేత సురవరం సుధాకర్‌రెడ్డి (Suravaram Sudhakar Reddy) సతీమణి, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని విజయలక్ష్మి ఈ మాయలో పడి రూ.10 లక్షలు పోగొట్టుకున్నారు. అసలు ఆ వీడియోలో ఏముంది? బ్యాంకు ఉద్యోగిని సైతం బోల్తా కొట్టించిన ఆ కొత్త ట్రిక్ ఏంటి?
బ్యాంకు ఉద్యోగికే షాక్ ఇచ్చిన కేటుగాళ్లు
సైబర్ నేరగాళ్లు ఎవరినీ వదలడం లేదు. మొన్నటికి మొన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సతీమణి స్టాక్ మార్కెట్ మోసంలో కోట్లు పోగొట్టుకోగా.. ఇప్పుడు సురవరం సుధాకర్‌రెడ్డి భార్య బీవీ విజయలక్ష్మి వంతు వచ్చింది. ఆమె ఒక బ్యాంకు ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆర్థిక లావాదేవీల మీద ఆమెకు పూర్తి అవగాహన ఉంది. అయినా సరే సైబర్ నేరగాళ్లు పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకున్నారు.
నిర్మలమ్మ వీడియో.. సెబీ పేరుతో వల!
సోషల్ మీడియాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మాట్లాడుతున్నట్లు ఉన్న ఒక వీడియో విజయలక్ష్మికి కనిపించింది. అందులో "సెబీ (SEBI) ఆధ్వర్యంలో ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయి" అని నమ్మించేలా ఆ వీడియో ఉంది.
అది డీప్‌ఫేక్ (Deepfake) వీడియో అని గ్రహించలేక ఆమె ఆ లింక్ క్లిక్ చేశారు. 'క్వాంటాపల్స్' అనే సంస్థ ద్వారా ఆదిత్య సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వాట్సాప్‌లో పరిచయమయ్యాడు. అక్కడి నుంచి అసలు దోపిడీ మొదలైంది.
లండన్ నుంచి ఫోన్.. రూ.10 లక్షలు స్వాహా
మొదట ఎంట్రీ ఫీజు కింద రూ.13 వేలు కట్టించుకున్నారు. ఆ తర్వాత యాప్‌లో లాభాలు వస్తున్నాయని నమ్మించి జనవరి 30న రూ.1.99 లక్షలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అంతటితో ఆగలేదు.
యూకే (UK) నుంచి 'ఆడంస్మిత్' అనే వ్యక్తి ఫోన్ చేసి, మీ ఖాతా వెరిఫికేషన్ చేయాలంటూ ఎస్బీఐ వివరాలు తీసుకుని మరో రూ.1.80 లక్షలు కొట్టేశారు. ఇలా పలు దఫాలుగా మొత్తం రూ.10.91 లక్షలు వసూలు చేశారు. చివరికి లాభాలు ఇవ్వమని అడిగితే.. మళ్లీ డబ్బులు కట్టమన్నప్పుడే తాను మోసపోయానని ఆమె గ్రహించి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.
కళ్లు, చెవులు నమ్మొద్దు.. వెరిఫై చేయండి!
ఒక రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి, ఒక సీబీఐ మాజీ అధికారి సతీమణి మోసపోయారంటే.. నేరగాళ్ల టెక్నాలజీ ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉందో అర్థం చేసుకోండి. వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో వచ్చే పెట్టుబడి సలహాలు 100% ఫేక్. సాక్షాత్తూ ప్రధాని, మంత్రులు చెప్పినట్లు వీడియోలు వచ్చినా నమ్మకండి. అవి AI సృష్టి. 'ఈజీ మనీ' ఆశ చూపిస్తున్నారంటే.. మీ అకౌంట్ ఖాళీ చేయడానికి స్కెచ్ వేస్తున్నట్లే లెక్క!

