Revanth Reddy on Modi: మోదీ బడే భాయ్, బీఆర్ఎస్ పై ఫైర్

naveen
By -
Revanth Reddy on Modi


రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. ఈ సూత్రాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్ఫెక్ట్ గా అమలు చేస్తున్నట్లున్నారు. ఒకపక్క ప్రధాని మోదీని 'పెద్దన్న' (Bade Bhai) అంటూ గౌరవిస్తూనే.. మరోపక్క ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) పై నిప్పులు చెరిగారు. "మీరు గంజాయి కొట్టి మాట్లాడుతున్నారా?" అంటూ కేసీఆర్ పార్టీ లీడర్లపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచాయి. అసలు మోదీని బడే భాయ్ అని రేవంత్ ఎందుకు అనాల్సి వచ్చింది? బీఆర్ఎస్ - బీజేపీ (BJP) బంధం గురించి ఆయన బయటపెట్టిన లాజిక్ ఏంటి?


'బడే భాయ్' అంటే తప్పేంటి?


హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "దేశానికి ప్రధాని కాబట్టి మోదీ కచ్చితంగా బడే భాయ్ (పెద్దన్న) అవుతారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేను చోటా భాయ్ (తమ్ముడిని). ఇందులో తప్పేముంది?" అని ప్రశ్నించారు. ఇంగ్లీష్ లో 'బిగ్ బ్రదర్' అంటారు, నేను హిందీలో చెప్పా.. అంతే తేడా అని క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా టీ న్యూస్ (T-News) జర్నలిస్టుతో జరిగిన సరదా సంభాషణ హైలైట్ గా నిలిచింది. "మీరు టీ న్యూస్ అయినంత మాత్రాన మీలో నేను కేసీఆర్ ను చూడను కదా.. జర్నలిస్టుగానే చూస్తాను" అంటూ చురకలు అంటించారు.


పదేళ్లు ఏం చేశారు? ఇప్పుడు ఓట్లు కావాలా?


మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ తీరును రేవంత్ ఎండగట్టారు. పదేళ్లు అధికారం, నిధులు, కీలక శాఖలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చేతుల్లోనే ఉన్నాయని, అప్పుడేం చేయని వారు ఇప్పుడు గెలిచి ఏం చేస్తారని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని కేసీఆర్.. ఇప్పుడు వార్డుల్లో గెలిస్తే అభివృద్ధిని అడ్డుకోవడం తప్ప చేసేదేమీ లేదని విమర్శించారు.


ఈగల్ టీమ్ దిగాలా? కొకైన్ తీసుకున్నారా?


బీఆర్ఎస్ నాయకుల మాటల తీరుపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి విద్వేషపూరిత ప్రసంగాలు, అహంకారం చూస్తుంటే.. "వీళ్లు గంజాయి లేదా కొకైన్ (Cocaine) తీసుకుని మాట్లాడుతున్నారా?" అని అనుమానం కలుగుతోందన్నారు. ఇలాగే మాట్లాడితే 'ఈగల్ టీమ్' (Eagle Team) గురించి చెప్పాల్సి వస్తుందేమో అని హెచ్చరించారు. అధికారం ఉన్నప్పుడు పిచ్చి ఉన్మాదంతో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) చేశారని, విచారణలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయని అన్నారు.


ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ!


బీఆర్ఎస్, బీజేపీ బంధాన్ని రేవంత్ బట్టబయలు చేశారు. 2014 నుంచి 2021 వరకు రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ లేనప్పుడు.. రైతు వ్యతిరేక చట్టాలు, జీఎస్టీ (GST), నోట్ల రద్దు వంటి ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎమ్ (ATM) గా మార్చుకున్నారని బీజేపీ విమర్శించిందే తప్ప.. చర్యలు తీసుకోలేదని, ఇదంతా వారి లోపాయికారీ ఒప్పందమేనని ఆరోపించారు.


రాజకీయం వేరు.. పాలన వేరు! 

కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే.. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలన్నది రేవంత్ స్ట్రాటజీ. మోదీని 'బడే భాయ్' అనడం ద్వారా.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం కోరుతూనే, బీఆర్ఎస్ ను బీజేపీకి దూరం చేసే ప్లాన్ ఇది.

Tags:

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!