AP Gas Supply: గ్యాస్ కొరత లేదు.. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు: సీఎం చంద్రబాబు సమీక్ష!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంట గ్యాస్ (LPG) సరఫరాపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రం నుంచి గ్యాస్ సరఫరా, నిల్వల పరిస్థితిపై ఆయన ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్‌తో పాటు గెయిల్, ఓఎన్జీసీ, ఇతర పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రజలు ప్యానిక్ కావొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు.
సరిపడా నిల్వలు.. అక్రమాలకు చెక్
రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని, ఇవి రాబోయే 15 రోజులకు సరిపోతాయని ముఖ్యమంత్రి వివరించారు. త్వరలోనే మరికొన్ని నిల్వలు కూడా రాష్ట్రానికి అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. అందువల్ల ఆస్పత్రులు, విద్యార్థుల హాస్టళ్లు, దేవాలయాలు వంటి అత్యవసర మరియు ముఖ్యమైన సంస్థలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ఈకేవైసీ (eKYC), ఓటీపీ (OTP) విధానాలను కఠినంగా అమలు చేయడం ద్వారా సిలిండర్ల బ్లాక్ మార్కెట్ డైవర్షన్‌ను అడ్డుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రత్యామ్నాయాలపై దృష్టి.. కేజీ బేసిన్ గ్యాస్ వినియోగం
గ్యాస్ పంపిణీ వ్యవస్థను స్వల్పకాలికంగా మరింత పటిష్టం చేయడంతో పాటు, ప్రత్యామ్నాయ మార్గాలపైనా తక్షణమే దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు సూచించారు. మార్కెట్‌లో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇండక్షన్ స్టవ్‌ల (Induction Stoves) నిల్వలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్‌లైన్ నెట్‌వర్క్ ద్వారా నేరుగా ఇళ్లకు సరఫరా చేసే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా సీఎన్జీ, పీఎన్జీ వినియోగాన్ని పెంచేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు.

