Himayani Puri: ఎప్‌స్టీన్ కేసులో మంత్రి కుమార్తెకు ఊరట

naveen
By -

ఎప్‌స్టీన్ కేసులో మంత్రి కుమార్తెకు ఊరట

Himayani Puri: ఎప్‌స్టీన్ కేసు వ్యవహారంలో కేంద్ర మంత్రి కుమార్తెకు భారీ ఊరట.. రూ. 10 కోట్ల పరువు నష్టం దావా!


అమెరికన్ లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసు వ్యవహారంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కుమార్తె హిమయానీ పూరికి ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఎప్‌స్టీన్‌తో హిమయానీకి సంబంధాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న దుష్ప్రచారంపై స్పందించిన న్యాయస్థానం మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై రూ. 10 కోట్ల నష్టపరిహారం కోరుతూ హిమయానీ పూరి దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ జరిపిన ధర్మాసనం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది.


24 గంటల్లో కంటెంట్ తొలగించాలి


సోషల్ మీడియాలో హిమయానీ పూరికి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ మొత్తాన్ని కేవలం 24 గంటల్లోగా తొలగించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి నిరాధారమైన కంటెంట్‌ను ఏ విధంగానూ ప్రచురించడం లేదా వ్యాప్తి చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని జస్టిస్ మినీ పుష్కర్ణ తీవ్రంగా తప్పుపట్టారు. హిమాయనీ పూరి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరుపుతూ.. ఒకవేళ ఆయా సోషల్ మీడియా వినియోగదారులు తమ పోస్టులను తొలగించకపోతే, సదరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లే స్వయంగా ఆ కంటెంట్‌ను తొలగించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ప్రాథమిక ఆధారాలను బట్టి హిమయానీ పూరికి అనుకూలంగా కేసు రుజువైందని, ఇప్పుడు ఆమెకు ఈ మధ్యంతర ఉపశమనం కల్పించకపోతే పూడ్చలేని తీవ్ర నష్టం వాటిల్లుతుందని కోర్టు పేర్కొంటూ తదుపరి విచారణను ఆగస్టు నెలకు వాయిదా వేసింది.


ఆర్థిక నిపుణురాలిగా ప్రపంచ ఖ్యాతి


ఈ కేసులో హిమయానీ పూరి తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. తన క్లయింట్ హిమయానీకి ఒక గొప్ప ఆర్థిక నిపుణురాలిగా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఆమె ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానంపై ఉందని ఆయన కోరారు. ఆమెపై వస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధమని, అవి నిరాధారమైనవి మరియు కేవలం దురుద్దేశపూర్వకంగా చేసినవని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు.


అసలేం జరిగిందంటే..


గత నెల (ఫిబ్రవరి 22, 2026) నుంచి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్ వంటి సోషల్ మీడియాతో పాటు పలు డిజిటల్ న్యూస్ పోర్టల్స్‌లో హిమయానీ పూరిపై ఒక తప్పుడు ప్రచారం మొదలైంది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో హిమయానీ పూరికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యాపార, ఆర్థిక లేదా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. తన ప్రతిష్టను దిగజార్చేలా జరుగుతున్న ఈ కుట్రపై ఆమె వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, తాజాగా ఢిల్లీ హైకోర్టు ఆమెకు అండగా నిలుస్తూ ఈ కీలక తీర్పును వెలువరించింది.