Bangladesh vs Pakistan ODI: ఆఘా రనౌట్ వివాదంపై లిట్టన్ దాస్

naveen
By -
Bangladesh vs Pakistan ODI


Bangladesh vs Pakistan Controversy: మేం వచ్చింది ఛారిటీ మ్యాచ్ ఆడేందుకు కాదు.. పాకిస్తాన్ రనౌట్ వివాదంపై లిట్టన్ దాస్ ఫైర్!


క్రికెట్ లో ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే బంగ్లాదేశ్ జట్టు మరోసారి స్పోర్ట్స్ మన్ స్పిరిట్ ను పక్కనబెట్టిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ చేసిన ఒక రనౌట్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెను దుమారం రేపుతోంది. బంతిని అందించడానికి క్రీజు దాటి ముందుకొచ్చిన పాకిస్తాన్ బ్యాటర్ సల్మాన్ అలీ ఆఘాను మిరాజ్ కనికరం లేకుండా రనౌట్ చేశాడు. దీనిపై పాక్ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతుంటే.. బంగ్లా వికెట్ కీపర్ లిట్టన్ దాస్ మాత్రం "మేం వచ్చింది ఛారిటీ ఆడేందుకు కాదు" అంటూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. అసలు ఆ 39వ ఓవర్లో ఏం జరిగిందో డీటెయిల్డ్ గా చూద్దాం.


అసలేం జరిగింది.. ఆఘా ఎందుకు ముందుకొచ్చాడు?


రెండో వన్డేలో పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో, మ్యాచ్ 39వ ఓవర్‌లో ఈ హై-డ్రామా చోటుచేసుకుంది. అప్పటికే సల్మాన్ ఆఘా (62 బంతుల్లో 64 పరుగులు), మొహమ్మద్ రిజ్వాన్ మంచి భాగస్వామ్యం నెలకొల్పి పాకిస్తాన్ జట్టును పటిష్ట స్థితికి తీసుకెళ్తున్నారు.


ఆ ఓవర్ నాలుగో బంతిని రిజ్వాన్ నేరుగా బౌలర్ వైపు స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. బౌలింగ్ వేసిన బంగ్లాదేశ్ కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ తన ఫాలో-త్రూలో బూట్‌తో ఆ బంతిని ఆపేందుకు ప్రయత్నిస్తూ, క్రీజులో ఉన్న నాన్-స్ట్రైకర్ ఆఘాను అనుకోకుండా ఢీకొట్టాడు. దాంతో బంతి సరిగ్గా వారిద్దరి కాళ్ల దగ్గరే ఆగిపోయింది. ఆ సమయంలో ఆఘా కేవలం బౌలర్ కు బంతిని తీసి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో క్రీజ్ బయటకొచ్చి బంతి వైపు వంగాడు.


ఇక్కడే మిరాజ్ తన బుద్ధి చూపించాడు. వెంటనే బంతిని తీసుకుని వెనక్కి తిరిగి నాన్-స్ట్రైకర్ ఎండ్ స్టంప్స్‌ను గిరాటేశాడు. అప్పటికి ఆఘా క్రీజ్‌లో బ్యాట్ పెట్టకపోవడంతో మిరాజ్ గట్టిగా అప్పీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ తన్వీర్ అహ్మద్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్‌కు నివేదించగా, బంతి ఇంకా డెడ్ కాలేదని (ఆటలోనే ఉందని) నిర్ధారించి ఆఘాను రనౌట్‌గా ప్రకటించారు.



రగిలిపోయిన పాక్ బ్యాటర్.. లిట్టన్ దాస్ కౌంటర్


సహాయం చేద్దామని వెళితే ఇలా మోసపూరితంగా రనౌట్ చేయడాన్ని ఆఘా జీర్ణించుకోలేకపోయాడు. వెంటనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ బౌలర్ మిరాజ్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవలోకి వికెట్ కీపర్ లిట్టన్ దాస్ కూడా ఎంటర్ అవ్వడంతో పిచ్ పై కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చివరకు రిజ్వాన్ మధ్యలో వచ్చి పరిస్థితిని శాంతింపజేశాడు.


మ్యాచ్ అనంతరం ఈ వివాదంపై లిట్టన్ దాస్ స్పందిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. "మొదటగా చెప్పాలంటే, ఇక్కడ ఎవరూ ఛారిటీ లీగ్ (దానధర్మాలు) ఆడేందుకు రాలేదు. ఇది ఒక అంతర్జాతీయ మ్యాచ్. నిబంధనల ప్రకారం ఔట్ అంటే ఔటే" అని అతను స్పష్టం చేశాడు.


స్పోర్ట్స్ మన్ స్పిరిట్ ఏదీ? ఆఘా ఆవేదన


ఈ రనౌట్ పై వ్యాఖ్యాతగా ఉన్న పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రమీజ్ రజా తీవ్రంగా మండిపడ్డాడు. రూల్స్ ప్రకారం అది ఔట్ అయినప్పటికీ, క్రికెట్ జెంటిల్మెన్ గేమ్ అన్న స్పోర్ట్స్‌మన్ స్పిరిట్ దెబ్బతిందని, బ్యాటర్ బౌలర్‌కు కేవలం సహాయం చేయడానికి మాత్రమే వెళ్లాడని రమీజ్ రాజా విమర్శించాడు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆఘా కూడా స్పందిస్తూ.. "రూల్స్ ప్రకారం వాడు చేసింది కరెక్టే కావచ్చు. కానీ నేను ఆ ప్లేస్ లో ఉంటే వేరేలా (స్పోర్ట్స్ మన్ స్పిరిట్ తో) వ్యవహరించేవాడిని" అని తన ఆవేదన వ్యక్తం చేశాడు.


క్రికెట్ లో రూల్స్ ముఖ్యమే కానీ, అంతకంటే ముఖ్యం క్రీడాస్ఫూర్తి (Sportsman Spirit). ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి వికెట్లు తీయడం వల్లే బంగ్లాదేశ్ జట్టు ఎప్పుడూ వివాదాల్లోనే నిలుస్తోంది. అశ్విన్ మన్కడింగ్ చేసినప్పుడు జరిగిన రచ్చకంటే ఇప్పుడు మిరాజ్ చేసిన పని ఇంకా దారుణంగా ఉంది. ఇలాంటి అన్-ఎథికల్ రనౌట్స్ చేయకుండా ఐసీసీ కచ్చితమైన గైడ్ లైన్స్ తీసుకురాకపోతే భవిష్యత్తులో ఆటగాళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరిగే ప్రమాదం ఉంది. మన గల్లీ క్రికెట్ లో కూడా ఇలా అవుట్ చేస్తే అస్సలు ఒప్పుకోరు కదా!