ఎలక్ట్రిక్ వాహనాలు (EV) రేపటి ప్రపంచ రవాణా రంగాన్ని శాసించబోతున్నాయి. మరి ఆ వాహనాలకు గుండెకాయ లాంటి బ్యాటరీలను ఎవరు నియంత్రిస్తే వాళ్లే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రారాజులు! నేడు సూపర్ పవర్ అనుకునే అమెరికా సైతం ఈ బ్యాటరీల కోసం చైనా ముందు మోకరిల్లుతున్న తీరు చూస్తుంటే, ఒక సామాన్యుడిగా మనకు అర్థం కావాల్సిన నగ్నసత్యం ఒకటుంది. చైనా దయ లేనిదే భవిష్యత్తులో చౌకైన ఈవీ కార్ల తయారీ అసాధ్యం! ఈ రంగంలో అమెరికా పరువు తీస్తూ చైనా సృష్టిస్తున్న నయా సామ్రాజ్యం కథ ఇది.
అమెరికాకు డ్రాగన్ సవాల్.. మమ్మల్ని కాదంటే మీ పతనం ఖాయం!
ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ బ్యాటరీల తయారీ సంస్థ చైనాకు చెందిన 'క్యాటెల్' (CATL- Contemporary Amperex Technology). దీని తర్వాత స్థానంలో ఉన్నది కూడా చైనాకే చెందిన బీవైడీ (BYD) కంపెనీయే. ఇప్పుడు ఈ రెండు కంపెనీలు అమెరికాకు ఒక స్పష్టమైన వార్నింగ్ ఇస్తున్నాయి.
చైనా లేకుండా అమెరికా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయలేదని కుండబద్దలు కొడుతున్నాయి. చైనా బ్యాటరీలను అమెరికాలో అడుగుపెట్టనివ్వబోమని అక్కడి చట్టసభల సభ్యులు ప్రగల్భాలు పలుకుతుంటే.. ఆ చైనా కంపెనీలు ఏమాత్రం భయపడకుండా "గుడ్ లక్.. మీ ఖర్మ" అంటూ బహిరంగంగానే అమెరికాను చూసి నవ్వుతున్నాయి.
మీ ఆంక్షలు మీకే ఉరితాడు
చైనాను అడ్డుకోవడానికి అమెరికా వేస్తున్న రక్షణ గోడల (protectionist efforts) వల్ల అంతిమంగా నష్టపోయేది అమెరికా ఆటోమొబైల్ రంగమేనని క్యాటెల్ నేతృత్వంలోని చైనా బ్యాటరీ పరిశ్రమ బలంగా నమ్ముతోంది. తన కంపెనీ (CATL) లేకుండా అమెరికా ఈవీ మార్కెట్ మనుగడ సాగించలేదని చైనా 4వ కుబేరుడు, క్యాటెల్ వ్యవస్థాపకుడు రాబిన్ జెంగ్ సవాల్ విసురుతున్నారు. 2025లో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనాల్లో మూడొంతుల బ్యాటరీలు క్యాటెల్ సంస్థవే కావడం ఆయన కాన్ఫిడెన్స్‌కు అసలు కారణం. మరోవైపు ప్రపంచ నంబర్ వన్ ఈవీ కార్ల కంపెనీ బీవైడీ (BYD) తన సొంత బ్యాటరీలను తానే తయారు చేసుకుంటోంది.
అమెరికా భయాలు.. మిలిటరీ ముద్ర!
చైనా బ్యాటరీల వల్ల అమెరికా సప్లై చైన్ దెబ్బతింటుందని, చైనా ఆర్థిక దౌర్జన్యాలకు అమెరికా బలైపోతుందని వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) నివేదిక హెచ్చరించింది. స్థానిక అమెరికన్ బ్యాటరీ కంపెనీలు ఎదగకుండా ఇది అడ్డుకట్ట వేస్తుందని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే 2025లో అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్).. చైనా మిలిటరీతో సంబంధాలున్న సంస్థల జాబితాలో క్యాటెల్‌ను చేర్చింది. అయితే ఇది పూర్తిగా "తప్పుడు ముద్ర" అని క్యాటెల్ మండిపడింది. దీనివల్ల వెంటనే ఎలాంటి బ్యాన్ లేకపోయినా.. అమెరికా కంపెనీలను భయపెట్టడానికే ప్రభుత్వం ఈ బ్లాక్ లిస్ట్ అస్త్రాన్ని ప్రయోగించింది.
తక్కువ ఖర్చు.. తిరుగులేని ఆధిపత్యం!
అత్యాధునిక టెక్నాలజీ, అత్యంత తక్కువ తయారీ ఖర్చుతోనే క్యాటెల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీ సంస్థగా ఎదిగింది. గత ఏడాది ఏకంగా 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 83 వేల కోట్లు) రికార్డు లాభాలను ఆర్జించింది. నేడు ప్రపంచంలో అమ్ముడవుతున్న ప్రతి మూడు ఈవీల్లో ఒకటి క్యాటెల్ బ్యాటరీతోనే నడుస్తోంది.
ప్రస్తుతం అమెరికాలో ఈవీ మార్కెట్ చిన్నదే అయినా.. కొన్నేళ్ల తర్వాత అది బూమ్ అవ్వక తప్పదని, అదే రేపటి భవిష్యత్తు అని రాబిన్ జెంగ్ ధీమాగా ఉన్నారు. నిజానికి అమెరికా, యూరప్ దేశాల్లో ఇప్పటికీ ఈవీల వాడకం చైనాతో పోలిస్తే చాలా తక్కువే. ఆ దేశాల్లో క్యాటెల్ పెద్దగా విక్రయాలు జరపకుండానే, కేవలం ఆసియా మార్కెట్‌తోనే ఈ స్థాయి గ్లోబల్ ఆధిపత్యాన్ని చెలాయిస్తుండటం విశేషం.
అమెరికా దిగ్గజాల సాగిలపాటు.. ఫోర్డ్, జీఎం, టెస్లా అంతా చైనా బాటే!
అమెరికా ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఆ దేశ ఆటోమొబైల్ దిగ్గజాలు మాత్రం చైనా కాళ్లు పట్టుకుంటున్నాయి. ఫోర్డ్ మోటార్స్.. సౌత్ కొరియా SK గ్రూప్‌ను కాదని, మిచిగాన్‌లో 3 బిలియన్ డాలర్లతో బ్యాటరీ ప్లాంట్ పెడుతోంది. అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి నేరుగా ప్లాంట్ పెట్టకుండా, క్యాటెల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (IP)ని లైసెన్స్ రూపంలో వాడుకుంటోంది.
అలాగే జనరల్ మోటార్స్ (GM).. ఏకంగా 60 శాతం భారీ పన్ను (టారిఫ్) కట్టి మరీ తన 'చేవ్రొలెట్ బోల్ట్' కారు కోసం క్యాటెల్ నుంచి బ్యాటరీలు దిగుమతి చేసుకుంటోంది. జీఎం వేల కోట్లు పెట్టి కట్టిన రెండు అమెరికన్ బ్యాటరీ ప్లాంట్లు ఖాళీగా పడి ఉన్నాయి. ఎందుకంటే, 30 వేల డాలర్ల బడ్జెట్ కారుకు సరిపడా చౌకైన బ్యాటరీలు వాళ్లు తయారుచేయలేరు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సైతం.. నెవాడాలో క్యాటెల్ టెక్నాలజీతో ఎనర్జీ-స్టోరేజ్ ప్లాంట్ నడుపుతోంది. టెస్లా కోర్ ఈవీ బిజినెస్ పడిపోతున్నా, ఈ ఎనర్జీ-స్టోరేజ్ వ్యాపారం మాత్రం అద్భుతంగా దూసుకుపోతోంది.
జాతీయ హీరో.. జిన్‌పింగ్ ఆస్థానంలో రాబిన్ జెంగ్
చైనాలో రాబిన్ జెంగ్ ఒక నేషనల్ టెక్ హీరో. 2025లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసే అరుదైన అవకాశం ఆయనకు దక్కింది. ఆ తర్వాత మార్చి 2026లో బీజింగ్‌లో జరిగిన చైనా అతిపెద్ద రాజకీయ సదస్సుకు సలహాదారుగా ఆహ్వానం అందుకున్నారు. "మా ఉత్పత్తులను ప్రపంచమంతా అమ్ముతాం.. అదే సమయంలో మా టెక్నాలజీ, మా ప్రమాణాలను విశ్వవ్యాప్తం చేస్తాం" అని బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ వేదికగా ఆయన సగర్వంగా ప్రకటించారు.
బ్యాటరీలంటే అమెరికాకు ఎందుకంత చులకన?
అమెరికా వెనుకబాటుతనంపై రాబిన్ జెంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లు ఎప్పుడూ ఏఐ (AI), సాఫ్ట్‌వేర్, చిప్స్ వెనకే పరిగెడతారని, ఎందుకంటే వాళ్లకు అక్కడ సులభంగా డబ్బులు వస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. బ్యాటరీల తయారీ రంగం అంటే అమెరికాలో ఒక "స్టూపిడ్ ఇండస్ట్రీ" కింద లెక్క అని ఆయన సెటైర్ వేశారు.
ముందుంది అసలైన యుద్ధం
రాబోయే పది పదిహేనేళ్ల ఆటోమొబైల్ భవిష్యత్తు అంతా చైనా బ్యాటరీల గుప్పెట్లోనే బందీ అయి ఉంది. రాజకీయ అహంకారంతో అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా, సామాన్యుడికి చౌకైన ఈవీ కార్లు అందించాలంటే డ్రాగన్ టెక్నాలజీకి సాగిలపడక తప్పని దయనీయ స్థితిలో పశ్చిమ దేశాలు ఇరుక్కున్నాయి. బ్యాటరీలపై చైనా ఆధిపత్యాన్ని అమెరికా బద్దలుకొట్టే వరకు, రోడ్డుపై నడిచే ప్రతి ఎలక్ట్రిక్ కారుకూ పరోక్షంగా చైనానే బాస్!
Also Read:
ఏఐ దెబ్బకు ఉద్యోగాలు పోకుండా వినోద్ ఖోస్లా మాస్టర్ ప్లాన్!అమెరికా vs ఇరాన్: పాకిస్థాన్‌లో రహస్య మంత్రాంగం వెనుక అసలు కథ!
ఏఐ మ్యాజిక్: బ్రోకర్ల ప్రమేయం లేకుండా ఇల్లు అమ్మి లక్ష డాలర్లు లాభం!
అమెరికాకు ఇరాన్ ఫైనల్ వార్నింగ్: భూతల దాడులు చేస్తే వదిలిపెట్టం!
ఏఐ దెబ్బకు ఉద్యోగాలు పోతున్నాయా? ఈ ఇద్దరికే సేఫ్!

