పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు కేవలం ఆ దేశాలనే కాదు, మన దేశంలోని సామాన్యుడి వంటింటిని సైతం భయపెడుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న భీకర మారణహోమం దెబ్బకు అంతర్జాతీయ ఇంధన సరఫరా వ్యవస్థలు కుప్పకూలాయి.
సముద్ర మార్గాలు మూసుకుపోవడంతో భారతదేశంలో గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితి చేయిదాటిపోకుండా కేంద్ర ప్రభుత్వం వాణిజ్య (కమర్షియల్) గ్యాస్ సిలిండర్లపై కఠిన ఆంక్షలు విధించి, కేవలం గృహావసరాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. ఫలితంగా దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఆతిథ్య రంగం ఒక్కసారిగా కుదేలయ్యాయి.
కిచెన్లలో మంటలు ఆరిపోయి, వ్యాపారాలు మందగించి హాహాకారాలు వ్యక్తమవుతున్న ఈ విపత్కర తరుణంలో.. హాస్పిటాలిటీ రంగానికి మహా ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
మార్చి 23 నుంచి అదనపు కోటా.. రాష్ట్రాలకు కేంద్రం స్పష్టమైన లేఖ
గ్యాస్ కొరతతో అల్లాడుతున్న రాష్ట్రాలకు ఊపిరిపోస్తూ, కేంద్రం అదనంగా 20 శాతం గ్యాస్ వాటాను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ అమృత ఘడియలు మార్చి 23వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు అత్యవసర లేఖలు సంధించారు.
ఈ తాజా పెంపుతో రాష్ట్రాలకు అందే వాణిజ్య గ్యాస్ కోటా.. యుద్ధ సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో ఏకంగా 50 శాతానికి చేరుకుంటుందని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు. ఈ అదనపు కేటాయింపులు సామాన్య ప్రజానీకానికి, కుదేలైన వివిధ ఆహార రంగాలకు ఒక పెద్ద ఊరటనిస్తుందని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది.
ప్రాధాన్యతలు ఖరారు.. అన్నమో రామచంద్రా అనకుండా పకడ్బందీ వ్యూహం
అయితే, కేంద్రం ఈ అదనపు 20 శాతం గ్యాస్‌ను గుడ్డిగా రాష్ట్రాలకు వదిలేయలేదు. దీన్ని ఎవరికి, ఎలా వినియోగించాలన్న దానిపై చాలా స్పష్టమైన గీతలు గీసింది. సామాన్యుడి ఆహార అవసరాలకు ఎలాంటి లోటూ రాకుండా ఉండేలా.. ముందుగా హోటళ్లు, రెస్టారెంట్లు, హైవేలపై ఉండే దాబాలు, ఇండస్ట్రియల్ క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కరాఖండీగా సూచించింది.
వీటితో పాటుగా పేదవాడి ఆకలి తీర్చే ప్రభుత్వ రాయితీ క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచెన్లు, బతుకుదెరువు కోసం వలస వచ్చిన కార్మికులకు ఉద్దేశించిన 5 కిలోల 'ఎఫ్టీఎల్' (FTL) సిలిండర్లను ఎలాంటి ఆటంకాలు లేకుండా కచ్చితంగా సరఫరా చేయాలని డాక్టర్ నీరజ్ మిట్టల్ తన లేఖలో రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు.
దోపిడీకి చెక్.. బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం
ఇక ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని దేశవ్యాప్తంగా సాగుతున్న దోపిడీని అరికట్టే బాధ్యతను కేంద్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల భుజస్కంధాలపైనే పెట్టింది. గ్యాస్ కొరత సాకుతో ఇప్పటికే ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమల్లో క్యాంటీన్లు మూతబడ్డాయి. అనేక హోటల్స్, రెస్టారెంట్లు తమ మెనూలను సగానికి పైగా కుదించేశాయి.
ఇదే అదునుగా కొన్ని కేఫ్‌లు, హోటళ్లు వినియోగదారుల బిల్లుల్లో ఏకంగా 'గ్యాస్ ఛార్జీలు' అంటూ అదనపు బాదుడుకు తెరతీశాయి. ఈ చీకటి దందాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని కేంద్రం హెచ్చరించింది. అదనపు కోటా బ్లాక్ మార్కెట్ పాలు కాకుండా, పక్కదారి పట్టకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత స్థానిక ప్రభుత్వాలదేనని తేల్చిచెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు మళ్లీ గాడిన పడేవరకు, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ కేటాయింపులు, కఠిన నిబంధనలు అమలులోనే ఉంటాయని స్పష్టం చేసింది. కేంద్రం తీసుకున్న ఈ సాహసోపేతమైన అడుగుతో.. రాబోయే రోజుల్లో మధ్యతరగతి ప్రజలకు, వలస కార్మికులకు కడుపు నిండా అన్నం దొరికే భరోసా లభించింది.
Also Read:
PM Modi Instagram Story: తండ్రి ప్రాణాల కోసం కొడుకు ఆవేదన.. నెట్టింట దిగొచ్చిన ప్రధాని మోదీ!Bengaluru Cylinder Theft : గల్ఫ్ యుద్ధం సెగ.. బెంగళూరులో బంగారం కాదు గ్యాస్ సిలిండర్ల చోరీ!
Mumbai Beach : ముంబై బీచ్‌లో అమ్ముడవుతున్న కన్నీళ్లు.. మీ బాధను వినడానికి రేటు ఫిక్స్ చేసిన యువకుడు!
Eid-ul-Fitr 2026 : నెలవంక రాకతో భువిపైకి దిగొచ్చిన పండుగ.. అంబరాన్నంటిన సోదరభావం!
Delhi Weather Report: మాడు పగిలే ఎండల నుంచి గజగజ వణికించే చలికి.. దేశ రాజధానిలో ప్రకృతి విచిత్రం!

