ఆకాశంలో చక్కర్లు కొడుతున్న యుద్ధ విమానాలు, సముద్రంలో మోహరించిన భారీ వినాశక నౌకలు.. పశ్చిమాసియా రణరంగంలో నిత్యం వినిపిస్తున్న మృత్యుఘోష ఇది. ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మూడు వారాలు పూర్తి చేసుకున్న వేళ, అగ్రరాజ్యం అమెరికా మైకుల ముందు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలకు పొంతనే లేకుండా పోతోందన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి.
రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ కెయిన్ లతో పాటు సాక్షాత్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస పత్రికా సమావేశాలు నిర్వహిస్తూ.. తామే గెలుస్తున్నామని, ఇరాన్ నాశనమైపోయిందని ఉదరగొడుతున్నారు. సరిగ్గా ఈ ఆత్మవిశ్వాసపు అబద్ధాలపైనే ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి ఉక్కుపాదం మోపారు. ఐదు దశాబ్దాల క్రితం నాటి ఘోరమైన వియత్నాం యుద్ధాన్ని గుర్తుచేస్తూ ఆయన అమెరికాపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విరుచుకుపడిన తీరు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై పెను సంచలనంగా మారింది.
'ఫైవో క్లాక్ ఫూలీస్'.. నాటి చీకటి చరిత్రను తవ్వితీసిన ఇరాన్
చరిత్ర ఎప్పుడూ తనను తాను పునరావృతం చేసుకుంటుందంటారు. ఇప్పుడు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి చేసిన వ్యాఖ్యలు అక్షరాలా దాన్ని నిజం చేస్తున్నాయి. వియత్నాం యుద్ధంలో అమెరికా పరాజయం పాలవుతున్నప్పటికీ, వైట్‌హౌస్ అధికారులు పైకి మాత్రం అంతా బాగుందన్న కల్పిత ఆత్మవిశ్వాసాన్ని ఎలా ప్రదర్శించారో ఆయన గుర్తుచేశారు.
ఆనాడు వియత్నాం అడవుల్లో వందల మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోతున్నా, ఓటమి ఖాయమని ప్రపంచానికి అర్థమైపోయినా.. స్వదేశంలోని ప్రజలకు భరోసా ఇవ్వడం కోసం అప్పటి కమాండర్ జనరల్ విలియం వెస్ట్‌మోర్లాండ్‌ను ప్రత్యేక విమానంలో అమెరికాకు రప్పించి నాటకమాడిన తీరును ఎవరూ మర్చిపోలేదంటూ ఆయన చురకలు అంటించారు.
యుద్ధ రంగం నుంచి రోజూ సాయంత్రం ఐదు గంటలకు వెలువడిన ఆ కల్పిత, అబద్ధపు నివేదికలే అమెరికా చరిత్రలో 'ఫైవో క్లాక్ ఫూలీస్' (Five O'Clock Follies) అనే అపఖ్యాతిని మూటగట్టుకున్నాయని ఆయన నిప్పులు చెరిగారు.
అదే కథ, వేరే వేదిక.. దశాబ్దం మారినా మారని అబద్ధం!
"ఇప్పటికీ అదే కథ కొనసాగుతోంది… కానీ వేదిక మాత్రమే మారింది. అప్పుడు వెస్ట్‌మోర్లాండ్ ఉంటే, ఇప్పుడు పీటర్ హెగ్సెత్ రంగంలోకి దిగారు. కానీ అమెరికా ఇచ్చే సందేశం మాత్రం అప్పటికీ, ఇప్పటికీ వాస్తవానికి ఆమడ దూరంలోనే ఉంది" అంటూ అరాఘ్చి ఘాటైన విమర్శనాస్త్రాలు సంధించారు.
క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో ప్రపంచానికి వివరిస్తూ ఆయన అమెరికా పరువు తీశారు. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు పూర్తిగా నాశనమయ్యాయని అమెరికా అధికారులు గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలోనే, అత్యంత అధునాతనమైన అమెరికన్ ఎఫ్-35 యుద్ధ విమానంపై దాడి జరగడం వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు.
ఇరాన్ నౌకాదళం అంతమైపోయిందని వారు ప్రకటిస్తున్న సమయంలోనే, అమెరికాకు చెందిన మహా నౌక యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ ఎందుకు వెనుదిరిగింది? మరో నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ భయంతో మరింత దూరంగా ఎందుకు కొట్టుకుపోయింది? అంటూ అరాఘ్చి సంధించిన ప్రశ్నలకు అమెరికా వద్ద సమాధానం కరువైంది. దశాబ్దాలు మారుతున్నా, "మనం గెలుస్తున్నాం" అనే అబద్ధపు మాట మాత్రం మారలేదని ఆయన అమెరికాను తీవ్రంగా ఎగతాళి చేశారు.
దీర్ఘకాలిక యుద్ధమా? అంతులేని అగాధమా?
అమెరికా చేస్తున్న ప్రకటనల్లో ఆందోళన కూడా దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సత్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్‌తో ఘర్షణ ఒక దీర్ఘకాలిక యుద్ధంగా మారబోతోందనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. "ఈ ఘర్షణ మొదలై కేవలం 19 రోజులు మాత్రమే అయినప్పటికీ, కొన్ని మీడియా వర్గాలు పరిస్థితిని అతిశయోక్తిగా చూపిస్తూ ఇది అంతులేని అగాధం వైపు లేదా ఎప్పటికీ ముగియని యుద్ధం దిశగా వెళ్తోందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వాస్తవం మాత్రం దీనికి చాలా భిన్నంగా ఉంది." అని ఆయన సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ, వాస్తవ పరిస్థితులు, ఇరాన్ ఇస్తున్న భీకర కౌంటర్లు చూస్తుంటే.. అమెరికా తన ప్రజలను మరోసారి చీకటిలో ఉంచుతోందా అన్న అనుమానాలు గ్లోబల్ డిఫెన్స్ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి.
Also Read:
Global Espionage War: ఉక్రెయిన్ కు అమెరికా సాయం ఆపితే.. ఇరాన్ కు మేం ఆపుతాం.. రష్యా డీల్ నిజమేనా?Kharg Island : పశ్చిమాసియాలో డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వ్యూహం.. ఇరాన్ గుండెకాయ 'ఖర్గ్ ద్వీపం'పై అగ్రరాజ్యం గురి!
Moscow to Tehran: రగులుతున్న పశ్చిమాసియాలో రష్యా మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్‌కు పుతిన్ అభయహస్తం!
Middle East Crisis: అగ్నిగుండంలో భారత నౌకల సాహసం.. హార్ముజ్ జలసంధిలో ఉత్కంఠ పోరు!
Trump Masterstroke: రంజాన్ వేళ ముగుస్తున్న మహాసంగ్రామం.. ఇరాన్ పతనాన్ని శాసించిన డొనాల్డ్ ట్రంప్!

