Global Espionage War: ఉక్రెయిన్ కు అమెరికా సాయం ఆపితే.. ఇరాన్ కు మేం ఆపుతాం.. రష్యా డీల్ నిజమేనా?

naveen
By -
Global Espionage War


ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఒకవైపు తూర్పు ఐరోపాలో ఉక్రెయిన్ రణరంగం, మరోవైపు పశ్చిమాసియాలో ఇరాన్ అగ్నిగుండం.. ఈ రెండు మారణహోమాలను ముడిపెడుతూ అంతర్జాతీయ మీడియాలో వెలుగుచూసిన ఒక సంచలన వార్త ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌ను కుదిపేస్తోంది. 


ఉక్రెయిన్‌కు అమెరికా గూఢచార సమాచారాన్ని ఆపివేస్తే, ఇరాన్‌కు తమ నిఘా నీడను తొలగిస్తామంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాకు ఒక భారీ 'క్విడ్ ప్రో కో' (ఒకదాని కోసం మరొకటి) ప్రతిపాదన చేశారన్న వార్తలను మాస్కో తీవ్ర స్థాయిలో ఖండించింది. ఇదంతా పశ్చిమ దేశాల మీడియా సృష్టిస్తున్న కట్టుకథ అని క్రెమ్లిన్ వర్గాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి.


మియామీ కేంద్రంగా సీక్రెట్ మీటింగ్.. ఉలిక్కిపడ్డ అగ్రరాజ్యాలు


అసలు ఈ వివాదానికి ఆజ్యం పోసింది అమెరికాకు చెందిన ప్రఖ్యాత 'పొలిటికో' వెబ్‌సైట్ ప్రచురించిన ఒక సంచలన నివేదిక. గత వారం మియామీలో అత్యంత రహస్యంగా ఒక సమావేశం జరిగిందని, ఆ భేటీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత సన్నిహిత దూతలు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్‌లతో.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కుడిభుజంగా భావించే కిరిల్ దిమిత్రియేవ్ మంతనాలు జరిపారని ఆ నివేదిక బాంబు పేల్చింది. 


ఫిబ్రవరి 2022లో రష్యా దండయాత్ర మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా ఇస్తున్న నిఘా సహకారాన్ని తక్షణమే నిలిపివేస్తే, దానికి ప్రతిఫలంగా ఇరాన్‌తో తమ గూఢచార సమాచార పంపిణీకి చెక్ పెడతామని రష్యా ఆఫర్ చేసిందని, అయితే అమెరికా ఆ ప్రతిపాదనను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించిందని ఇద్దరు కీలక వ్యక్తులను ఉటంకిస్తూ పొలిటికో రాసుకొచ్చింది.


వార్ మెషీన్ ప్రచారం.. మండిపడ్డ ట్రంప్ వర్గం, మాస్కో


ఈ వార్త బయటకు వచ్చిన క్షణాల్లోనే అటు మాస్కో, ఇటు ట్రంప్ వర్గం తీవ్రంగా ప్రతిస్పందించాయి. పుతిన్ సన్నిహితుడు కిరిల్ దిమిత్రియేవ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఈ నివేదికను కొట్టిపారేశారు. అమెరికా, రష్యా మధ్య ఎలాంటి క్విడ్‌ప్రోక్ డీల్ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు రిపబ్లికన్ చట్టసభ్యురాలు అన్నా పౌలినా లూనా సైతం పొలిటికోపై నిప్పులు చెరిగారు. 


అదొక ఉక్రెయిన్ యుద్ధ అనుకూల యంత్రాంగానికి పనిచేసే ప్రచార సాధనం అని ఆమె విమర్శించారు. వారికి వైట్‌హౌస్‌లోకి గానీ, రష్యాతో జరిగే అంతర్గత శాంతి చర్చల్లోకి గానీ ప్రవేశం లేదని కుండబద్దలు కొట్టారు. రష్యా, అమెరికా మధ్య ఉద్రిక్తతలను మరింత ఎగదోయడానికి వారు చేస్తున్న ఇలాంటి కుట్రపూరిత ప్రయత్నాలను ఏమాత్రం పట్టించుకోవద్దని ఆమె ప్రపంచానికి పిలుపునిచ్చారు.


ఇరాన్‌కు రష్యా గూఢచర్య సాయం.. వాషింగ్టన్ పోస్ట్ సంచలనం


ఇదిలా ఉంటే, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్‌కు రష్యా అత్యంత కీలకమైన నిఘా సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తోందని ఇటీవల 'వాషింగ్టన్ పోస్ట్' ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. పశ్చిమాసియా జలాల్లో మొహరించిన అమెరికా యుద్ధ నౌకలు, ఆకాశంలో చక్కర్లు కొడుతున్న యుద్ధ విమానాల కచ్చితమైన కోఆర్డినేట్స్‌ను ఇరాన్‌తో పంచుకుంటోందని ఆరోపించింది. 


అయితే, ఈ ఆరోపణలను కూడా మాస్కో తోసిపుచ్చింది. ఫిబ్రవరి 28 నుంచి పశ్చిమాసియాలో జరుగుతున్న భీకర యుద్ధంలో ఆపదలో ఉన్న ఇరాన్‌కు తాము కేవలం మానవతా దృక్పథంతో మాత్రమే సహాయం చేస్తున్నామని, అంతకు మించి ఎలాంటి గూఢచార సాయం చేయడం లేదని తేల్చిచెప్పింది. కాగా, ఉక్రెయిన్‌‌పై యుద్ధం మొదలైన కొత్తలో రష్యా దాడుల కోసం ఇరాన్ భారీగా డ్రోన్లను సరఫరా చేసిన సంగతి తెలిసిందే.


ట్రంప్ మాస్ వార్నింగ్.. ఆ సమాచారంతో వాళ్లేం పీకలేరు!


యుద్ధంలో ఇరాన్‌తో గూఢచార సమాచారాన్ని రష్యా పంచుకుంటే అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, డొనాల్డ్ ట్రంప్ దీనికి ఏమాత్రం సంతోషించరని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్టీ హెచ్చరించారు. అయితే, స్వయంగా ట్రంప్ మాత్రం ఈ నిఘా వ్యవహారంపై చాలా లైట్‌గా స్పందించారు. 


అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడానికి రష్యా సమాచారం ఇచ్చినా అది పెద్దగా ఉపయోగపడదని ట్రంప్ కొట్టిపారేశారు. "గత వారంలో ఇరాన్‌కు ఎలాంటి భయంకరమైన పరిస్థితి ఎదురైందో మీరంతా చూశారు. వారికి ఎంత సమాచారం అందుతున్నప్పటికీ, అది ఇరాన్‌ను కాపాడటానికి ఏమాత్రం సహాయపడటం లేదు" అని మార్చి 8న విలేకరుల సమావేశంలో ట్రంప్ తనదైన శైలిలో తేల్చిచెప్పారు. అగ్రరాజ్యాల మధ్య రగులుతున్న ఈ నిఘా వార్ ముందుముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.