అంతర్జాతీయ జియోపాలిటికల్ చదరంగంలో పావులు వేగంగా కదులుతున్నాయి. మొన్నటిదాకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి అడిగినా.. "మా వైమానిక స్థావరాలు ఇచ్చే ప్రసక్తే లేదు" అని తెగేసి చెప్పిన బ్రిటన్, ఇప్పుడు అనూహ్యంగా యూ-టర్న్ తీసుకుంది. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు, ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇంధన సంక్షోభం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మెడలు వంచాయి. హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు, ఇరాన్ స్థావరాలపై భీకర దాడులు చేసేందుకు తమ సైనిక స్థావరాలను వాడుకోవచ్చంటూ అగ్రరాజ్యం అమెరికాకు యూకే ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సంచలన నిర్ణయంతో మూడో ప్రపంచ యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకుంటున్నాయి.
భగ్గుమన్న గల్ఫ్.. విలవిలలాడుతున్న ఐరోపా
అసలు బ్రిటన్ తన వైఖరిని రాత్రికి రాత్రే ఎందుకు మార్చుకుందంటే.. దానికి ప్రధాన కారణం ఇరాన్ సృష్టించిన ఇంధన విలయతాండవమే. గత నెల 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై చేసిన మెరుపు దాడి, మధ్యప్రాచ్యాన్ని అగ్నిగుండంగా మార్చింది. ఆ దెబ్బతో రగిలిపోయిన ఇరాన్ ప్రతీకార దాడులకు తెగబడింది. గల్ఫ్ దేశాలలోని చమురు, గ్యాస్ క్షేత్రాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఖతార్‌లోని అతిపెద్ద గ్యాస్ క్షేత్రాన్ని నేలమట్టం చేయడంతో పాటు, ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేసింది. దీంతో వందలాది ఆయిల్ ట్యాంకర్లు సముద్ర జలాల్లోనే దిగ్బంధనానికి గురయ్యాయి. క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తి, ఐరోపా దేశాలు కరెంటు లేక, చలికి వణికిపోతూ విలవిలలాడిపోయాయి. బతుకు దెరువు కోసం ఇరాన్‌కు వ్యతిరేకంగా ఐరోపా, జపాన్ దేశాలు ఏకం కావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
అగ్రరాజ్యానికి యూకే సైనిక స్థావరాలు
పరిస్థితి చేయిదాటిపోవడం, ఇంధన సంక్షోభంతో తమ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ముంచుకురావడంతో ఐరోపా దేశాల ఆలోచనా విధానంలో పెను మార్పు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హార్ముజ్ జలసంధిని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని పశ్చిమ దేశాలు నిశ్చయించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే, ఇంతకాలం తటస్థంగా ఉందామని భావించిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్.. చివరకు అమెరికా ఒత్తిడికి తలొగ్గారు. ఇరాన్ స్థావరాలను ధ్వంసం చేసేందుకు తమ దేశంలోని వైమానిక, నావికా స్థావరాలను వాడుకునేందుకు అమెరికా దళాలకు పూర్తి అనుమతులు మంజూరు చేశారు. ఈ నిర్ణయం యుద్ధ గమనంలో ఒక భారీ మలుపుగా రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇరాన్ భీకర హెచ్చరిక.. అగ్నిగుండంలోకి బ్రిటన్?
తమపై దాడులకు అమెరికాకు వేదికను కల్పిస్తున్న బ్రిటన్ తీరుపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా దళాలకు తమ స్థావరాల్లోకి ప్రవేశం కల్పించడం ద్వారా, కీర్ స్టార్మర్ ప్రభుత్వం స్వయంగా బ్రిటిష్ ప్రజల ప్రాణాలను పణంగా పెడుతోందని ఇరాన్ భీకర హెచ్చరికలు జారీ చేసింది. తమ ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుని తీరుతామని, అమెరికా దళాలు ఎక్కడి నుంచి దాడులు చేస్తే, ఆ స్థావరాలను కూడా నేలమట్టం చేస్తామని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. అసలు ఇరాన్‌తో యుద్ధం చేయడం యూకే ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదని, కేవలం అమెరికా మెప్పు పొందేందుకు సొంత పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయడం ఏమాత్రం భావ్యం కాదని ఇరాన్ యంత్రాంగం బ్రిటన్‌కు హితవు పలికింది. మొత్తానికి బ్రిటన్ తీసుకున్న ఈ నిర్ణయం అట్లాంటిక్ తీరంలోనూ యుద్ధ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది.
Also Read:
Diego Garcia Attack: డియాగో గార్సియాపై ఇరాన్ గురి.. అగ్రరాజ్యాన్ని ఉలిక్కిపడేలా చేసిన క్షిపణి దాడి!US Oil Waiver to Iran: సముద్రం సాక్షిగా అమెరికా మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్ చమురుపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం
Cuba Energy Crisis: క్యూబా గడ్డపై రగులుతున్న ప్రచ్ఛన్న యుద్ధం.. ట్రంప్ ఆంక్షలకు చెక్ పెడుతున్న రష్యా, చైనా!
Air India Flight To Nowhere: ఢిల్లీ టు ఢిల్లీ.. 8 గంటల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఎయిర్ ఇండియా విమానం!
Iran Crisis: 94 కోట్ల రివార్డ్.. ఇజ్రాయెల్ గురి.. ఊహాగానాల నడుమ ఎట్టకేలకు తెరపైకి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్!
UK Visa Fee Hike: ఇంధన సంక్షోభం వేళ లండన్ మాస్టర్ స్ట్రోక్.. వలసదారులపై ‘వీసా’ పిడుగు!
Trump Shocking Comments: ఓవల్ ఆఫీసులో పిన్ డ్రాప్ సైలెన్స్.. జపాన్ ప్రధాని ముందు ట్రంప్ పేల్చిన 'పెర్ల్ హార్బర్' బాంబు!

