ఒకవైపు పశ్చిమాసియాలో భీకర యుద్ధం.. ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు.. ముంచుకొస్తున్న గ్యాస్ సంక్షోభం. అసలే ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్న ప్రపంచ దేశాల ప్రజల నెత్తిన బ్రిటన్ ప్రభుత్వం అకస్మాత్తుగా ఊహించని పిడుగు వేసింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఈ తీవ్రమైన గందరగోళ పరిస్థితుల మధ్య అదును చూసి లండన్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఉన్నత చదువుల కోసం ఆశగా బ్రిటన్ గడ్డపై అడుగుపెట్టాలనుకునే విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లే కార్మికులు, పర్యాటకుల ఆశలపై నీళ్లు చల్లుతూ వీసా ఛార్జీలను భారీగా పెంచేసింది.
ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి.. దెబ్బతిన్న సామాన్యుడి ఆశలు
స్టూడెంట్, విజిటర్, వర్కర్ సహా అన్ని కేటగిరీల వీసా ఫీజులను ఏకపక్షంగా పెంచుతున్నట్లు యూకే హోమ్ ఆఫీస్ విడుదల చేసిన తాజా ప్రకటన ఇప్పుడు వలసదారుల గుండెల్లో గుబులు రేపుతోంది. వీసాలతో పాటు సెటిల్మెంట్, స్పాన్సర్ లైసెన్స్ ఫీజుల కొత్త ఛార్జీలు ఏప్రిల్ 8వ తేదీ నుంచే కచ్చితంగా అమల్లోకి రానున్నాయని ఆ ప్రకటనలో తేల్చిచెప్పారు. విదేశాల నుంచి వచ్చే దరఖాస్తుల రుసుములను సుమారు ఆరు నుంచి ఏడు శాతం మేర పెంచాలని నిర్ణయించినట్లు బ్రిటన్ ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. ఏళ్ల తరబడి డబ్బు కూడబెట్టుకుని లండన్ ఫ్లైట్ ఎక్కాలని కలలుకనే మధ్యతరగతి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈ పెంపు ఒక పెనుభారంగా మారనుంది.
అమాంతం పెరిగిన ఛార్జీలు.. వేలల్లో అదనపు భారం
హోమ్ ఆఫీస్ ప్రకటించిన కొత్త రేట్లను నిశితంగా గమనిస్తే.. ఈ పెంపు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో సీటు సాధించి వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల రుసుము ఇప్పటివరకు 524 పౌండ్లుగా ఉండగా, దాన్ని ఏకంగా 558 పౌండ్లకు పెంచేశారు. అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.69,814 సమర్పించుకోవాల్సిందే. ఇక ఆరు నెలల పాటు వాలిడిటీ ఉండే సాధారణ విజిటర్ వీసా ఛార్జీ సైతం 127 పౌండ్ల నుంచి 135 పౌండ్లకు (సుమారు రూ.16,890) చేరుకుంది.
ఉపాధి కోసం బ్రిటన్ వెళ్లే కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వారి దరఖాస్తు రుసుమును 769 పౌండ్ల నుంచి ఏకంగా 819 పౌండ్లకు (సుమారు రూ.1,02,470) పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీటికి తోడు, మూడేళ్లకు పైబడి యూకేలో ఉండేందుకు దరఖాస్తు చేసుకునే వారి రుసుము 1519 పౌండ్ల నుంచి ఏకంగా 1618 పౌండ్లకు (సుమారు రూ.2,02,437) ఎగబాకింది. ప్రపంచం ఆర్థిక మాంద్యం అంచున నిలబడి ఉన్న ఈ తరుణంలో.. బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయం వలసదారులకు ఒక కోలుకోలేని ఆర్థిక దెబ్బగా మిగిలిపోనుంది.
Also Read:
Trump Shocking Comments: ఓవల్ ఆఫీసులో పిన్ డ్రాప్ సైలెన్స్.. జపాన్ ప్రధాని ముందు ట్రంప్ పేల్చిన 'పెర్ల్ హార్బర్' బాంబు!US vs Iran War: పల్టీ కొట్టిన ట్రంప్ వ్యూహం.. ఇరాన్ చేతిలో అమెరికాకు ఊహించని పరాభవం!
Hormuz Strait Crisis: హార్ముజ్ కోసం ఆరు దేశాల కూటమి.. ఇరాన్‌కు చెక్ పెట్టేందుకు రంగంలోకి!
Middle East Crisis: ఖతార్ గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ భీకర దాడి.. భారత్‌కు తప్పని ఇంధన కష్టాలు!
Global Internet Outage Fears : సముద్ర గర్భంలో కేబుళ్ల కట్టింగ్ కు ఇరాన్ ప్లాన్.. కోవిడ్ కంటే భయంకరమైన పరిస్థితులు!

