అది అమెరికా అధికార పీఠం వైట్ హౌస్‌లోని అత్యంత కీలకమైన ఓవల్ ఆఫీసు. కెమెరాల ఫ్లాష్‌ల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని సనే తకాయిచి చిరునవ్వులతో ఆసీనులై ఉన్నారు. అంతా సవ్యంగా సాగిపోతోంది అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. గదిలో సూది కిందపడినా వినిపించేంత నిశ్శబ్దం అలుముకుంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో ట్రంప్ నోటి నుంచి జాలువారిన ఒకే ఒక్క మాట.. దశాబ్దాల నాటి చేదు జ్ఞాపకాన్ని తవ్వి తీయడమే కాకుండా, మిత్రదేశపు ప్రధాని ముఖంలో నెత్తురు చుక్క లేకుండా చేసింది. అసలు ఆ నాలుగు గోడల మధ్య ఆ క్షణంలో ఏం జరిగిందంటే..
ఒక విలేకరి వేసిన ప్రశ్న.. రగిలిన దౌత్య అగ్గి
జపాన్ ప్రధాని అమెరికా పర్యటనలో భాగంగా జరిగిన ఈ ప్రెస్ మీట్‌లో అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో జపాన్‌కు చెందిన ఓ విలేకరి అడిగిన ప్రశ్న అక్కడి వాతావరణాన్ని మార్చేసింది. "అధ్యక్షా.. ఇరాన్‌పై అమెరికా ఇటీవల అంతటి విధ్వంసకర మెరుపు దాడులు చేసింది కదా, మరి కనీసం మీ అత్యంత సన్నిహిత మిత్రదేశమైన జపాన్‌కు ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదు?" అని సదరు విలేకరి సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్న వినగానే ట్రంప్ ముఖంలో ఎప్పటిలాగే తనదైన మార్క్ దూకుడు కనిపించింది.
"మరి ఆనాడు మీరెందుకు చెప్పలేదు?"
విలేకరి ప్రశ్నకు బదులిస్తూ ట్రంప్ కొద్దిగా ముందుకు వంగి, "మేము శత్రువుపై చాలా శక్తిమంతంగా దాడి చేయాలనుకున్నాం. అందుకే ఆ ఆపరేషన్ ఒక 'సర్ ప్రైజ్' లా ఉండాలని ఎవరికీ చెప్పలేదు" అని సమర్థించుకున్నారు. కట్ చేస్తే.. మరుక్షణం ఆయన చూపు నేరుగా తన పక్కనే కూర్చున్న జపాన్ ప్రధాని సనే తకాయిచి వైపు మళ్లింది. "అయినా.. ఆకస్మిక దాడుల గురించి జపాన్ వాళ్లకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలుస్తుంది? మరి ఆనాడు పెర్ల్ హార్బర్ దాడి చేసే ముందు మీరు మాకు చెప్పారా?" అంటూ ట్రంప్ ఒక్కసారిగా బాంబు పేల్చారు. ఆ దెబ్బకు జపాన్ ప్రధాని తలదించుకోగా.. అక్కడున్న దౌత్య అధికారులంతా షాక్‌లో ఉండిపోయారు.
సర్ ప్రైజ్ ఎటాక్ తోనే సక్సెస్: ట్రంప్ కుండబద్దలు
గదిలో వాతావరణం ఎంత గంభీరంగా మారినా ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాను తీసుకున్న నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టినట్లు సమర్థించుకున్నారు. "మేము ఎవరికీ చెప్పకుండా చేసిన ఆ ఆకస్మిక దాడి వల్లే ఇరాన్ కీలక స్థావరాలను ధ్వంసం చేయగలిగాం. ఒకవేళ మిత్ర దేశాలకు ముందే లీక్ చేసి ఉంటే ఆ ఆపరేషన్ అట్టర్ ఫ్లాప్ అయ్యేది" అని స్పష్టం చేశారు.
డ్యామేజ్ కంట్రోల్ చేసిన తకాయిచి
ట్రంప్ చేసిన అనూహ్య వ్యాఖ్యతో కంగుతిన్న జపాన్ ప్రధాని తకాయిచి.. వెంటనే తేరుకుని డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ట్రంప్ నాయకత్వాన్ని ఆకాశానికెత్తుతూ పరిస్థితిని చక్కదిద్దారు. "ప్రపంచంలో శాంతిని నెలకొల్పడం కేవలం మీతోనే సాధ్యమని నేను బలంగా నమ్ముతున్నాను" అంటూ ఆమె ట్రంప్‌ను ప్రశంసించారు. ప్రస్తుత భద్రతా సవాళ్లతో గ్లోబల్ ఎకానమీకి పొంచి ఉన్న ముప్పును ఆమె పరోక్షంగా గుర్తుచేశారు.
ఆనాటి నెత్తుటి జ్ఞాపకం..
1941 డిసెంబర్ 7న జపాన్ నేవీ.. అమెరికాలోని పెర్ల్ హార్బర్‌పై ఊహించని విధంగా మెరుపు దాడి చేసి 2,403 మంది అమెరికన్లను బలితీసుకుంది. ఆ కసితోనే అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగింది. అదంతా గతం. దశాబ్దాలుగా ఈ రెండు దేశాలు అత్యంత సన్నిహిత మిత్రులుగా మెలుగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి తరుణంలో, ఇరాన్ దాడుల అంశాన్ని కప్పిపుచ్చుకునేందుకు ట్రంప్ ఏకంగా పెర్ల్ హార్బర్ దాడిని ప్రస్తావించడం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
Also Read:
Hormuz Strait Crisis: హార్ముజ్ కోసం ఆరు దేశాల కూటమి.. ఇరాన్‌కు చెక్ పెట్టేందుకు రంగంలోకి!Middle East Crisis: ఖతార్ గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ భీకర దాడి.. భారత్‌కు తప్పని ఇంధన కష్టాలు!
Global Internet Outage Fears : సముద్ర గర్భంలో కేబుళ్ల కట్టింగ్ కు ఇరాన్ ప్లాన్.. కోవిడ్ కంటే భయంకరమైన పరిస్థితులు!
Middle East Crisis: ఇంధన క్షేత్రాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు.. రంగంలోకి దిగిన ట్రంప్
Qatar vs Iran: 24 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. ఇరాన్ అధికారులకు ఖతార్ వార్నింగ్

