Air India Crash Report: ఎయిరిండియా విమాన ప్రమాదంపై సంచలనం.. 11 ఏళ్లుగా అదే లోపం!

naveen
By -

Air India Crash Report

గతేడాది (2025) జూన్ 12వ తేదీన అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో 260 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ విమాన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుండగా.. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ విమానయాన భద్రతా సంస్థ 'ఫౌండేషన్ ఫర్ ఏవియేషన్ సేఫ్టీ' (FAS - Foundation for Aviation Safety) విస్తుపోయే విషయాలను వెల్లడించింది. కుప్పకూలిన ఆ విమానం గత 11 ఏళ్లుగా తీవ్రమైన సాంకేతిక సమస్యలతోనే నడిచిందని తేల్చి చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఒక్కరోజులో జరిగిన ప్రమాదం కాదు..


ఎఫ్ఏఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎడ్ పియర్సన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో కేవలం ఆ ఒక్కరోజు తలెత్తిన లోపం వల్లే ప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు. గత 11 ఏళ్ల కాలంలో ఆ విమానంలో అనేక కీలక వ్యవస్థలు తరచూ విఫలమవుతూ వచ్చాయని ఆయన బాంబు పేల్చారు. విమానంలోని విద్యుత్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ నియంత్రణలలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, విమానానికి శక్తిని సరఫరా చేసే యూనిట్‌లో (Power Supply Unit) తరచూ అంతరాయాలు ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. అలాగే పైలట్లకు దిశానిర్దేశం చేసే కంప్యూటర్ వ్యవస్థలో కూడా (Navigation System) వైఫల్యాలను తాము గుర్తించామన్నారు.


ఆధారాలు పంపినా స్పందన కరువు..


ఇవన్నీ తాము గాల్లోంచి ఊహించి చెబుతున్న మాటలు కావని ఎడ్ పియర్సన్ స్పష్టం చేశారు. ఈ సంచలన నిజాలకు సంబంధించిన అత్యంత కీలక పత్రాలను, ఆధారాలను తాము సేకరించామని, వాటిని భారత విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (AAIB) తో పాటు జాతీయ రవాణా భద్రతా బోర్డు (NTSB) లకు పంపినట్లు ఆయన తెలిపారు. అయితే ఇంతటి బలమైన ఆధారాలు పంపినా.. భారత దర్యాప్తు సంస్థల నుంచి కనీస స్పందన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కనీసం తాము రాసిన లేఖలకు కూడా సదరు దర్యాప్తు సంస్థలు జవాబు ఇవ్వలేదని ఆయన బహిరంగంగా ఆరోపించారు.


ప్రయాణికుల భద్రతను గాలికొదిలేసి, తీవ్ర సాంకేతిక లోపాలు ఉన్న విమానాలను నడపడం వల్లే ఇన్ని వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం దారుణమని ఎడ్ పియర్సన్ మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ విమాన ప్రమాదంపై అత్యంత సమగ్రమైన, పారదర్శకమైన పునర్విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఎఫ్ఏఎస్ చేసిన ఈ తీవ్ర ఆరోపణలపై ఏఏఐబీ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమని తేలితే.. భారత విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలపై ప్రయాణికుల్లో తీవ్ర నమ్మకం సడలే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.