Middle East Crisis: ఇంధన క్షేత్రాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు.. రంగంలోకి దిగిన ట్రంప్

naveen
By -

Middle East Crisis

Middle East Crisis: ఖతార్ ఎల్ఎన్జీ కేంద్రంపై ఇరాన్ భీకర దాడి.. ట్రంప్ సీరియస్ వార్నింగ్!


పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ప్రతీకార దాడులు కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, గత రెండు మూడు రోజులుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇరాన్ అత్యున్నత నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న వరుస దాడులతో ఇరాన్ రగిలిపోతోంది.


వ్యూహం మార్చిన ఇరాన్.. ఇంధన క్షేత్రాలే లక్ష్యంగా!


కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఖమేనీ కుడిభుజం అలీ లారిజానీ, ఆర్మీ చీఫ్ సోలేమానీ, నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్‌లను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇరాన్ తన వ్యూహాన్ని మార్చుకుంది. గల్ఫ్ దేశాల్లోని ఇంధన క్షేత్రాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే అతిపెద్ద ఇంధన క్షేత్రమైన ఖతార్‌లోని ఎల్ఎన్జీ (LNG) ప్లాంట్‌పై దాడికి పాల్పడటం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.


ముంచుకొస్తున్న ఇంధన సంక్షోభం


తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తే, రానున్న రోజుల్లో గల్ఫ్ దేశాల్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ మరింత భీకర దాడులు చేసే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తల్లకిందులవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు ఇరాన్ దాడులు మరింత పెరిగితే, ఇంధనం కోసం ప్రపంచ దేశాలు అల్లాడిపోయే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


రంగంలోకి ట్రంప్.. ఇరాన్‌కు స్ట్రాంగ్ కౌంటర్


ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే దాడి చేసిందని, అయితే దానికి ప్రతీకారంగా అమాయక దేశమైన ఖతార్‌పై ఇరాన్ దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతా ద్వారా స్పష్టం చేశారు. ఇరాన్ ఇంధన కేంద్రంపై కేవలం ఇజ్రాయెల్ మాత్రమే దాడి చేసిందని, అందులో అమెరికాకు గానీ, ఖతార్‌కు గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఖతార్ మౌలిక సదుపాయాలపై ఇరాన్ అన్యాయంగా దాడికి పాల్పడిందని ఆయన మండిపడ్డారు.


హద్దులు మీరితే ప్రతీకారం తప్పదు!


భవిష్యత్తులో ఇరాన్ మరొకసారి ఖతార్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడితే పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో ఇరాన్‌లోని సౌత్ పార్స్ మైదానంపై ఇజ్రాయెల్ కూడా ఇక ఎలాంటి దాడులకు పాల్పడదని ఆయన హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఇరాన్ హద్దులు మీరి ప్రవర్తిస్తే మాత్రం.. ఇజ్రాయెల్ ప్రమేయం లేకుండానే, అమెరికా తన అత్యంత శక్తివంతమైన బలప్రయోగం ద్వారా సౌత్ పార్స్ మైదానంపై ప్రతీకారం తీర్చుకుంటుందని ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.