Israel vs Iran War: ఎక్కడున్నా వదిలిపెట్టం.. మోజ్తాబా ఖమేనీకి ఇజ్రాయెల్, ట్రంప్ వార్నింగ్

naveen
By -

మోజ్తాబా ఖమేనీకి ఇజ్రాయెల్, ట్రంప్ వార్నింగ్

Israel vs Iran: ఎక్కడున్నా వెంటాడి వేటాడుతాం.. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీకి ఇజ్రాయెల్ వార్నింగ్!


ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయతుల్లా మోజ్తాబా ఖమేనీకి ఇజ్రాయెల్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెంటాడి మరీ మట్టుబెడతామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ శపథం చేశారు. ఇజ్రాయెల్ ఉనికికి ముప్పుగా పరిణమించే వారు ఎప్పుడూ తమ టార్గెట్ లిస్ట్‌లోనే ఉంటారని ఆయన పునరుద్ఘాటించారు. యుద్ధం మొదలైన తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడంతో, ఆయన వారసుడిగా రెండో కుమారుడు మోజ్తాబా ఖమేనీ ఆ పదవిని అధిష్టించారు. అప్పటినుంచే మోజ్తాబాను సైతం అంతం చేస్తామని ఇజ్రాయెల్ బహిరంగంగా ప్రకటిస్తూ వస్తోంది.


గురి మాత్రం తప్పదు..


ప్రస్తుతం మోజ్తాబా ఖమేనీ ఎక్కడున్నారో తమకు కచ్చితమైన సమాచారం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు డెఫ్రిన్ సమాధానమిచ్చారు. అయితే, తమ దేశానికి ముప్పుగా ఉన్నవారిని వెంబడించడం మాత్రం ఎప్పటికీ ఆపబోమని ఆయన స్పష్టం చేశారు. తమకు ప్రమాదం తలపెట్టేవారు ఏ మూలన నక్కినా తమ టార్గెట్ నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తామనేది కచ్చితంగా చెప్పలేకపోయినా.. తమ గురి మాత్రం ఎన్నటికీ తప్పదని డెఫ్రిన్ వ్యాఖ్యానించారు. కేవలం అగ్ర నాయకత్వానికే పరిమితం కాకుండా, రివల్యూషనరీ గార్డ్స్‌లోని శక్తివంతమైన బసిజ్ దళాలను సైతం తాము లక్ష్యంగా చేసుకుంటామని ఆయన ప్రకటించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం మోజ్తాబాను వదిలిపెట్టబోమని శపథం చేసిన విషయం తెలిసిందే.


రష్యాకు మోజ్తాబా.. కొట్టిపారేసిన ఇరాన్


ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా దళాలు సంయుక్తంగా జరిపిన దాడిలో మోజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, మెరుగైన చికిత్స కోసం ఆయనను రహస్యంగా రష్యాకు తరలించినట్లు అంతర్జాతీయ స్థాయిలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇదంతా శత్రు దేశాలు ఆడుతున్న కొత్త మానసిక యుద్ధం అని రష్యాలోని ఇరాన్ రాయబారి కాజెమ్ జలాలీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. ఇరాన్ నాయకులకు ఎక్కడికో పారిపోయి దాక్కోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని, వారు ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉంటారని ఆయన స్పష్టం చేశారు.


ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ కీలక నేతల మృతి


తాజాగా మంగళవారం నాడు ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో ఇరాన్‌కు చెందిన ఇద్దరు కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారిజానీతో పాటు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అనుబంధ విభాగం బసీజ్ ఫోర్స్ కమాండర్ జనరల్ గులామ్ రెజా సాల్మనీ ఈ దాడుల్లో మృతి చెందారు. అలీ లారిజానీ మృతిని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సైతం అధికారికంగా ధ్రువీకరించింది. దాడి జరిగిన సమయంలో లారిజానీ తన కుమార్తె నివాసంలో ఉన్నారని, ఈ ఘోర ఘటనలో ఆయనతో పాటు ఆయన కుమారుడు, ఇతర సహాయకులు కూడా మరణించినట్లు వెల్లడించింది.