Kabul Airstrikes: పాక్ దాడిపై రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

naveen
By -
పాక్ దాడిపై రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

Kabul Airstrikes: కాబూల్ ఆస్పత్రిపై పాక్ దారుణ కాండ.. రషీద్ ఖాన్, నబీ తీవ్ర ఆగ్రహం!


పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. సోమవారం రాత్రి ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లోని ఒక పెద్ద రిహాబిటేషన్ (పునరావాస) ఆస్పత్రిపై పాకిస్థాన్ వైమానిక దళాలు దారుణమైన బాంబుల వర్షం కురిపించాయి. ఈ భయంకరమైన దాడిలో ఏకంగా 400 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 2000 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రి పాక్ దాడితో దాదాపుగా నేలమట్టమైంది.


పాక్ బుకాయింపు.. తాలిబన్ల ఫైర్

ఈ దారుణాన్ని పాకిస్థాన్ వైమానిక దళమే చేసిందని తాలిబన్లు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అయితే, పాకిస్థాన్ మాత్రం ఈ ఆరోపణలను ఎప్పటిలాగే ఖండిస్తోంది. తాము కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, పౌరుల ఆస్పత్రులపై దాడులు చేయలేదని బుకాయిస్తోంది. ఆఫ్ఘాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. పౌర ప్రాంతాలు, ఆస్పత్రులపై దాడులు చేయడం ముమ్మాటికీ మానవత్వానికి విరుద్ధమని మండిపడ్డారు.


రంజాన్ వేళ అమానుషం: రషీద్, నబీ

ఈ అమానుష ఘటనపై ఆఫ్ఘనిస్థాన్ స్టార్ క్రికెటర్లు తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. "పౌర ప్రాంతాలు, ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం అతిపెద్ద యుద్ధ నేరం. ఐక్యరాజ్యసమితి (UN) వెంటనే ఈ విషయంలో కలుగజేసుకోవాలి" అని స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ డిమాండ్ చేశారు. అలాగే మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ సైతం పాక్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "రంజాన్ పవిత్ర మాసంలో, అందులోనూ రాత్రి వేళ ఇలా అమాయకుల ప్రాణాలు తీయడం అత్యంత అమానుషం" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.