Kabul Airstrikes: కాబూల్ ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడి.. 400 మంది మృతి, భగ్గుమన్న తాలిబాన్లు!
ఆఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో పాకిస్థాన్ జరిపిన భారీ వైమానిక దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మాదకద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స అందించే ఒక పెద్ద రిహాబిటేషన్ ఆస్పత్రిపై పాక్ దళాలు సోమవారం అర్ధరాత్రి బాంబుల వర్షం కురిపించాయి. ఈ దారుణ ఘటనలో ఏకంగా 400 మందికి పైగా మరణించారని, మరో 250 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఆఫ్ఘన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ దాడితో ఆస్పత్రిలోని చాలా భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భవనంలో చెలరేగిన మంటలను అదుపు చేయడానికి, శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
పాకిస్థాన్ ఖండన.. ఉగ్రవాదులే మా లక్ష్యం
ఆఫ్ఘాన్ చేస్తున్న ఈ తీవ్రమైన ఆరోపణలను పాకిస్థాన్ పూర్తిగా ఖండించింది. కాబూల్, తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లలో తాము జరిపిన దాడుల్లో ఏ పౌర స్థావరాలను, ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకోలేదని పాక్ స్పష్టం చేసింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికార ప్రతినిధి మోషారఫ్ జైదీ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. కేవలం సైనిక, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై మాత్రమే తాము కచ్చితమైన (ప్రిసిషన్) దాడులు చేశామని వెల్లడించారు. ప్రాణనష్టం జరగకుండా ఈ ఆపరేషన్‌ను చాలా జాగ్రత్తగా నిర్వహించినట్లు పాక్ రక్షణ శాఖ సమర్థించుకుంది. అయితే, ఈ దాడులను తాలిబాన్ అధికారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరణించిన వారిలో ఎక్కువ మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులే ఉన్నారని ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సరిహద్దుల్లో రగులుతున్న చిచ్చు
ఈ భారీ వైమానిక దాడులకు కొన్ని గంటల ముందే పాకిస్థాన్, ఆఫ్ఘన్ దళాలు ఇరు దేశాల సరిహద్దు రేఖ అయిన ‘డ్యూరాండ్ లైన్’ వద్ద పరస్పరం భారీ కాల్పులకు దిగాయి. పాకిస్థాన్ దళాలు రాత్రిపూట మోర్టార్ షెల్స్‌తో ఆగ్నేయ ఖోస్ట్ ప్రావిన్సులోని ఆఫ్ఘన్ గ్రామాలపై దాడి చేశాయని, ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు అమాయకులు మృతి చెందారని ఆఫ్ఘన్ అధికారులు ఆరోపించారు. పాకిస్థాన్ లోపల దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్ తాలిబాన్లతో (TTP) సహా అనేక ఉగ్రవాద గ్రూపులకు ఆఫ్ఘాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్థాన్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను ఆఫ్ఘాన్ ఖండిస్తుండటంతో రెండు దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం తారాస్థాయికి చేరుకుంది.

