Al-Aqsa Mosque: ఇరాన్ యుద్ధం వేళ ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం.. అల్ అక్సా మసీదు మూసివేతపై భగ్గుమన్న అరబ్ దేశాలు!
పశ్చిమాసియాలో భీకరంగా సాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు సరికొత్త మతపరమైన వివాదానికి దారితీసింది. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన జెరూసలేంలోని 'అల్ అక్సా మసీదు'ను ఇజ్రాయెల్ గత 16 రోజులుగా పూర్తిగా మూసివేసింది. భద్రతా కారణాల దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాలు, ఇస్లామిక్ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అరబ్ లీగ్ తీవ్ర ఆగ్రహం
రంజాన్ పండుగ సందర్భంగా మసీదును మూసివేయడాన్ని అరబ్ దేశాల కూటమి అయిన 'అరబ్ లీగ్' ఆదివారం తీవ్రంగా ఖండించింది. ముస్లింల ప్రార్థనా స్థలాలను మూసేసి, వారి ఆరాధనా స్వేచ్ఛను హరించే హక్కు ఇజ్రాయెల్‌కు ఏమాత్రం లేదని అరబ్ లీగ్ కుండబద్ధలు కొట్టింది. ఇది ముమ్మాటికీ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ తీసుకుంటున్న ఇలాంటి ఏకపక్ష చర్యలు ప్రాంతీయ, ప్రపంచ శాంతి భద్రతలపై అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. జెరూసలేం పవిత్ర స్థలాలపై ఇజ్రాయెల్ చేస్తున్న చట్టవిరుద్ధమైన చర్యలను తక్షణమే ఆపేలా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రపంచ దేశాలకు అరబ్ లీగ్ విజ్ఞప్తి చేసింది.
ముక్తకంఠంతో ఖండించిన ఇస్లామిక్ దేశాలు
అరబ్ లీగ్‌తో పాటు అనేక అంతర్జాతీయ సంస్థలు, దేశాలు ఇజ్రాయెల్ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
- ఖతార్, జోర్డాన్, ఇండోనేషియా, టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యూఏఈ సహా ఎనిమిది అరబ్-ఇస్లామిక్ దేశాలు మసీదు మూసివేతను సంయుక్తంగా ఖండించాయి.
- ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC), ముస్లిం వరల్డ్ లీగ్ (MWL), అల్-అజార్, ఆఫ్రికన్ యూనియన్, అరబ్ పార్లమెంట్ కూడా ఇజ్రాయెల్ నిర్ణయంపై తీవ్రంగా మండిపడుతున్నాయి.
- 1967లో ఇజ్రాయెల్ తూర్పు జెరూసలేంను ఆక్రమించిన తర్వాత, ఇలా ఇన్ని రోజులు మసీదును మూసేయడం (లాంగెస్ట్ రంజాన్ షట్‌డౌన్) ఇదే తొలిసారని పాలస్తీనియన్ అథారిటీ ఆవేదన వ్యక్తం చేసింది.
- ఈ పరిణామాన్ని పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్ ఏకంగా "యుద్ధ ప్రకటన"గా అభివర్ణించింది.
భద్రతా కారణాలే అంటున్న ఇజ్రాయెల్
ఫిబ్రవరి 28న ఇరాన్‌తో మొదలైన యుద్ధం నేపథ్యంలోనే ఆక్రమిత జెరూసలేంలోని అల్ అక్సా మసీదును మూసివేసినట్లు ఇజ్రాయెల్ సమర్థించుకుంటోంది. కేవలం అల్ అక్సా మసీదు మాత్రమే కాకుండా, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని ఇబ్రహీమి మసీదులో కూడా కేవలం 50 మంది మాత్రమే ప్రార్థన చేయడానికి అధికారులు అనుమతిస్తున్నారు. ఇరాన్ నుంచి ఎప్పుడైనా భారీ క్షిపణి దాడులు జరిగే ప్రమాదం ఉందని, ఆ భద్రతా కారణాల దృష్ట్యానే ప్రజలు గుమికూడకుండా ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు ఇజ్రాయెల్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

