Iran War 2026: ఇరాన్‌ను ఇంకా గట్టిగా కొట్టండి.. డొనాల్డ్ ట్రంప్‌కు సౌదీ క్రౌన్ ప్రిన్స్ సీక్రెట్ రిక్వెస్ట్!
పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా సాగిస్తున్న భీకర యుద్ధం ముమ్మరంగా మూడో వారంలోకి అడుగుపెట్టింది. రోజురోజుకూ రక్తం పారుతున్న ఈ యుద్ధ నేపథ్యంలో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్‌పై దాడుల తీవ్రతను మరింతగా పెంచాలని, వాళ్లను ఇంకా గట్టిగా కొట్టాలని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS).. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రైవేట్‌గా కోరినట్లు ప్రఖ్యాత ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక తన తాజా నివేదికలో వెల్లడించింది.
ఇరాన్‌పై సౌదీ పాత పగే..
ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్ వ్యాప్తంగా విస్తరిస్తున్న తరుణంలో, ట్రంప్‌తో సౌదీ క్రౌన్ ప్రిన్స్ నిరంతరం ఫోన్‌లో టచ్‌లో ఉన్నట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ట్రంప్ అనేక మంది అరబ్ దేశాల నాయకులతో మాట్లాడుతున్నారని, వారిలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ ట్రంప్‌ను అత్యంత గట్టిగా సమర్థిస్తున్నారని వైట్ హౌస్ ప్రతినిధులు సైతం చెబుతున్నారు. వాస్తవానికి టెహ్రాన్‌పై సౌదీ అరేబియాది పాత పగే. గతంలో దివంగత రాజు అబ్దుల్లా కూడా ఇరాన్‌పై సైనిక దాడి చేయాలని అమెరికాను పదే పదే కోరినట్లు కథనం గుర్తుచేసింది. ఇస్లామిక్ ప్రపంచంలో రాజకీయ ప్రభావం, సైనిక శక్తి, మతపరమైన ఆధిపత్యం కోసం ఎప్పటినుంచో ఇరాన్‌ను సౌదీ అరేబియా తన ప్రధాన శత్రువుగా చూస్తోంది.
ఖమేనీ మృతి.. రగిలిపోతున్న ఇరాన్
గత నెల ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై ముప్పేట దాడులు ప్రారంభించాయి. ఆ దాడులు జరిగిన మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఆయనతో పాటే ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్లు, కీలక పాలనాధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. తమ సుప్రీం లీడర్ మృతితో రగిలిపోతున్న ఇరాన్ అప్పటి నుంచి ప్రతీకార దాడులకు తెగబడుతోంది. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రైన్, కువైట్, ఖతార్ దేశాలపై విరుచుకుపడుతోంది. ముఖ్యంగా ఈ దేశాల్లో ఉన్న యూఎస్ మిలిటరీ స్థావరాలు, ఇంధన (చమురు) సౌకర్యాలపైనే ఇరాన్ ప్రధానంగా టార్గెట్ చేస్తోంది.
హార్మూజ్ జలసంధి మూసివేత.. గ్లోబల్ టెన్షన్
ఈ దాడులు, ప్రతిదాడులు ఒక ఎత్తైతే.. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన 'హార్మూజ్ జలసంధి'ని ఇరాన్ మూసివేయడం మరో ఎత్తు. అంతర్జాతీయ చమురు రవాణాలో ఐదో వంతు ప్రయాణించే ఈ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో ప్రపంచ ఇంధన భద్రత తీవ్ర ప్రమాదంలో పడింది. దేశవ్యాప్తంగా చమురు ధరలు భగ్గుమనే ప్రమాదం పొంచి ఉంది. ఒక పక్క అమెరికా దాడులు, మరోపక్క ఇరాన్ ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా అక్షరాలా అగ్నిగుండంగా మారిపోయింది.

