Hormuz Strait Crisis: యుద్ధ మేఘాల మధ్య గుజరాత్ చేరిన 'శివాలిక్'.. ఫలించిన భారత దౌత్య మంత్రాంగం!
పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ, భారత నౌకలకు కాస్త ఊరట లభించింది. ఇరాన్ దిగ్బంధించిన అత్యంత కీలకమైన 'హార్మూజ్ జలసంధి'ని (Strait of Hormuz) దాటుకుని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన 'శివాలిక్' ఎల్‌పీజీ ట్యాంకర్ సోమవారం గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది.
గమ్యం చేరుకుంటున్న భారత నౌకలు
శివాలిక్‌తో పాటు 'నందా దేవి' అనే మరో భారీ భారతీయ ట్యాంకర్ కూడా ఈ జలసంధిని విజయవంతంగా దాటి, మంగళవారం ముంబై తీరానికి చేరుకోనుంది. గత నెలలో ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో యుద్ధం మొదలైన తర్వాత, స్వదేశానికి చేరుకున్న రెండవ, మూడవ ట్యాంకర్లు ఇవే కావడం గమనార్హం. అంతకుముందు సౌదీ అరేబియా నుంచి ముడి చమురుతో వస్తున్న లైబీరియా జెండా ఉన్న నౌక మొదటిది కాగా, ఇప్పుడు ఏకంగా రెండు దేశీయ నౌకలు సురక్షితంగా బయటపడటం వాణిజ్య వర్గాలకు ఊపిరి పీల్చుకునేలా చేసింది.
ఫలించిన జైశంకర్, మోదీ చర్చలు
భారత ట్యాంకర్లు ఇంత సురక్షితంగా గమ్యం చేరుకోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ దౌత్యపరమైన కృషి ఎంతో దాగి ఉంది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్, తన ఇరాన్ కౌంటర్‌పార్ట్ అబ్బాస్ అరాఘ్చీతో ఏకంగా నాలుగు దఫాలుగా విస్తృత చర్చలు జరిపారు. అలాగే గత వారం ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ దౌత్య మంత్రాంగం వల్లే ఒక్కొక్కటి 92,700 మెట్రిక్ టన్నుల గ్యాస్‌ను మోసుకొస్తున్న శివాలిక్, నందా దేవి ట్యాంకర్లకు ఇరాన్ సురక్షిత మార్గం కల్పించింది.
మిగిలిన నౌకల కోసం ముమ్మర యత్నాలు
ఈ రెండు ట్యాంకర్లే కాకుండా, హార్మూజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన మరో రెండు డజన్ల (24కు పైగా) భారతీయ వాణిజ్య నౌకలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముమ్మరంగా పనిచేస్తోంది. ఈ మేరకు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా కీలక అప్డేట్ ఇచ్చారు. ఒమన్ నుంచి ఆఫ్రికాకు గ్యాసోలిన్ తీసుకెళ్తున్న 'జగ్ ప్రకాష్' అనే నాలుగో భారతీయ ట్యాంకర్ కూడా జలసంధి తూర్పు వైపు నుంచి సురక్షితంగా తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు.
చుక్కలు తాకుతున్న చమురు ధరలు
ప్రపంచ చమురు, గ్యాస్ వాణిజ్యంలో ఐదో వంతు ప్రయాణించే ఈ హార్మూజ్ జలసంధిపై ఇరాన్ అనధికారిక దిగ్బంధనం విధించడంతో సరుకు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఇరాన్ వాణిజ్య నౌకలనే లక్ష్యంగా చేసుకుంది. దీంతో ఈ రూట్‌లో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. రెండుసార్లు బ్యారెల్ ధర వంద డాలర్లు (US$100) దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దానికి తోడు, గత వారం యూఏఈ నుంచి గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు వస్తున్న థాయ్‌లాండ్ నౌకపై ఈ రూట్ లోనే దాడి జరగడం ప్రపంచ దేశాలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

